Advertisementt

ఏపీ రాజకీయాల్లో చెరగని సంతకం యువగళం!

Mon 27th Jan 2025 11:32 AM
lokesh  ఏపీ రాజకీయాల్లో చెరగని సంతకం యువగళం!
Yuvagalam Padayatra For Two years ఏపీ రాజకీయాల్లో చెరగని సంతకం యువగళం!
Advertisement
Ads by CJ

అయిదేళ్ల అరాచక పాలనపై సమరశంఖం పూరించిన రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభమై రేపటికి రెండేళ్లు పూర్తయింది. రాష్ట్రంలో 5కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27వతేదీన  పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చేశారు. ఉద్యోగాల్లేక నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు...  ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే గ్యారంటీలేక భయాందోళనలతో మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుభారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ యువనేత నారా లోకేష్ ఆనాడు జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణ విజయం సాధించింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో యువగళం కీలకపాత్ర పోషించింది. 

ప్రతికూల వాతావరణంలోనూ అడుగు ముందుకే!

యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. యువగళం యాత్ర జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మాదిరి శని,ఆదివారాల్లో వీక్లీ ఆఫ్ లతో ఆషామాషీగా సాగలేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామలేకుండా యువగళం పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం మంత్రి లోకేష్ పాదయాత్రను ఆపలేదు. ఎండ, వాన, తుపానులను సైతం లెక్కచేయకుండా మంత్రి లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షాన్నిలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్కచేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో లక్ష్యంగా దిశగా సాగారు యువనేత లోకేష్. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగసభలు, 155ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు.  కుటుంబసభ్యుడిలా భావించి తమ బాధలు చెప్పుకుంటూ యువనేతకు జనం నీరాజనాలు పట్టారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మందికి ప్రజలను యువనేతతో కనెక్ట్ అయ్యారు.

అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం

యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించడంతో అప్పటి ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం నుంచి నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు  ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర తంబళ్లనియోజకవర్గం చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25కేసులు బనాయించారు. ఇందులో యువనేత లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పసుపు సైనికులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసిపి ముష్కరమూకలు, పోలీసులు కలిసి యువగళం వాలంటీర్లను రెచ్చగొట్టి తిరిగే వారిపైనే తప్పుడు కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితోసహా 46మంది కీలకనాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అప్పటి అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దంపట్టింది. 

రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం

యాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్ ముందుకు సాగిన తీరు టిడిపి కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ చేయని కుట్రలు లేవు. అయితే ఉక్కు సంకల్పంతో యజ్ఞంలా సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వైసిపి ముష్కరమూకల వల్లకాలేదు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము 3.30వరకు ఎదురుచూడటం యువనేత లోకేష్ పై నెలకొన్న అభిమానంతోపాటు అప్పటి అరాచక ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారు. 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగింది. రాయలసీమలో యువగళానికి లభించిన అపూర్వస్పందన అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉక్కుసంకల్పంతో సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు.

ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జేజేలు

చైతన్యానికి మారుపేరైన ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో  9 నియోజకవర్గాలు, 12రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు యువనేతకు ఆత్మీయస్వాగతం పలికారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువగళం ముందుకు సాగింది.పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో 79రోజులపాటు సుదీర్ఘ విరామానంతరం రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద నవంబర్ 27న పునఃప్రారంభమైన యువగళం 2.0లో ప్రజలు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 7రోజులు, 113 కి.మీ.లు మాత్రమే యాత్ర కొనసాగినప్పటికీ ప్రజలు అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది ప్రజలు, అభిమానులు, మహిళలు, టిడిపి-జనసేన కార్యకర్తలు యువనేతకు నీరాజనాలు పట్టారు.

పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు

యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగసభలు నిర్వహించి  మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. యువగళం పాదయాత్ర సాగిన 97అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. సమాధానం చెప్పలేని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. యువగళం పాదయాత్ర దారిలో టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వైసీపీ పాల‌న‌లో సాగిన విధ్వంసం, అవినీతిని సెల్ఫీల‌తో వివ‌రిస్తూ ప్రజ‌ల్ని చైత‌న్యవంతం చేశారు. పాదయాత్ర సాగే సమయంలో ఎక్కడ ఎవరి బండారాన్ని బయటపెడతారోనని ఆనాటి అధికారపార్టీ శాసనసభ్యులు భయపడేంతలా యువనేత లోకేష్ యాత్ర సాగింది.

అభిమానులు, పీడిత ప్రజలకు దగ్గరగా...

యువగళం పాదయాత్ర సందర్భంగా తమను కలిసే అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేశారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగారు. ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభించింది. 226రోజుల సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్ 3.5లక్షల మందికి పైగా  అభిమానులతో ఫోటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500మంది యువనేతతో సెల్ఫీ దిగారు. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో యువనేత లోకేష్ ను లక్షలాది ప్రజలు కలుసుకొని తమ సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. ఇందులో కొందరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో యువనేత లోకేష్ వారిని ఊరడించి నేనున్నానంటూ అండగా నిలచారు. సమస్య తీవ్రతను బట్టి ప్రతిజిల్లాలోనూ యువనేత లోకేష్ వ్యక్తిగత నిధులతో సాయమందించారు. సంబంధిత బాధితుల వివరాలు తీసుకొని, వారికి సాయం అందించేవరకు సహాయకుల ద్వారా వాకబుచేస్తూ ఆపన్నుల్లో ధైర్యం నింపారు.

హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు

సుదీర్ఘ యువగళం పాదయాత్రలో యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా సీమ ప్రజల కోసం కడపలో మిషన్ రాయలసీమపేరుతో డిక్లరేషన్ ను ప్రకటించారు.  యువనేత లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రతిబింబిస్తూ ఎన్ డిఎ కూటమి సూపర్ సిక్స్ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించింది. పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజునే మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చాక యువతకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువనేత లోకేష్ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4లక్షలమందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.  మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్, గూగుల్, టిసిఎస్, వీడియోకాన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయి. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన యువనేత లోకేష్... ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. పోలీసు వలయాలు, పరదాల మాటున కాకుండా అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడే ప్రజానాయకుడని ఆచరాత్మకంగా నిరూపిస్తున్న యువకెరటం నారా లోకేష్ నేటితరం రాజకీయ నాయకులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

 

Yuvagalam Padayatra For Two years:

Two Years For Lokesh Yuvagalam Padayatra 

Tags:   LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ