మొదటి రోజు ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు నెలవల విజయ శ్రీ, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ , జేసి శుభం బన్సల్, మున్సిపల్ చైర్మన్ శ్రీ మంత్ రెడ్డి లతో కలసి రాష్ట్ర సంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, స్థానిక సూళ్ళూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ నుండి జూనియర్ కళాశాల వరకు శోభయాత్రగా ర్యాలీ ప్రారంభించి జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు బెలూన్ ఎగురవేసి తరువాత ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించి కార్యక్రమమును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యురాలు మాట్లాడుతూ.... ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఐదేళ్ళ తరువాత మళ్ళీ మన ప్రాంతంలో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఎంతైనా ఉందని అలాగే టూరిజం శాఖా మంత్రి వర్యుల సహాయ సహకారం అందించారని, అలాగే జిల్లా కలెక్టర్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించుటకు చాలా శ్రమించారని వారితో పాటు జిల్లా యంత్రాంగం అందరు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ భాగస్వామ్యం విజయవంతం చేయవలసినదిగా తెలిపారు. ఈ నెల 18 నుండి 20 వరకు ఈ ఫ్లెమింగో కార్యక్రమాలను నిర్వహించుకోనున్నామని , పులికాట్ సరస్సు, అటకాని తిప్ప, బి వి పాలెం బోటింగ్ తదితర టూరిస్ట్ ప్రదేశాలను మన జిల్లా ప్రజలే కాకుండా విద్యార్థినీ విద్యార్థులు, యువత , ప్రకృతి ప్రేమికులు, ప్రక్క రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి తిలకించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయి విజయవంతం చేయవలసినదిగా తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. మాట్లాడుతూ సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందనీ, తిరుపతి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం నిర్వహించుకుంటున్నామని, గత నవంబర్ నెల గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ఎందుకు నిర్వహించట్లేదు మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చెప్పడంతో శాసనసభ్యులు సూళ్లూరుపేట వారితో సమన్వయం చేసుకొని మీ అందరి ముందు ఈ రోజు జిల్లా యంత్రాంగం మొత్తం ఫ్లెమింగో ఫెస్టివల్ ను మీ అందరి ముందుకు తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ నోడల్ శాఖగా, అటవీ శాఖ సపోర్టింగ్ శాఖగా రెండు శాఖల ఆధ్వర్యంలో మనం నేడు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నామనీ అన్నారు. మన వన్య సంపదను, మన పులికాట్ సరస్సును, మన నేలపట్టు పక్షుల అభయారణ్యాన్నీ ప్రమోట్ చేస్తూ, ఇక్కడ పులికాట్ సరస్సు మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంతటి ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మంచి పర్యాటక కేంద్రాలుగా వీటిని గుర్తించి ఆం.ప్ర రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్పలో పులికాట్ సరస్సు, బీవీపాలెంలో బోటింగ్ పాయింట్, అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఐలాండ్స్ ఉన్నాయని తెలిపారు. టూరిజం వల్ల మనకు ఎంతో ఆదాయం వస్తుందనీ, ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా టూరిజం మీద వచ్చే సంపద చాలా ఎక్కువ ఉంటుందనీ, ఒకవైపు టూరిజం చేస్తూనే ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉందన్నారు. ఇక్కడి మత్స్యకారులకు ఉన్న సమస్యలపై మనం దృష్టి పెట్టుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఎప్పుడు ఆలోచిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయనీ, వాటిని అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటిగా మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నిటికి కూడా క్యాచ్ మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉందనీ తమిళనాడు రాష్ట్రం నుండే కాకుండా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి చాలామంది పర్యాటకులు వస్తారని అన్నారు. పర్యాటకులకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి గారికి తెలుపుతూ సదరు ప్రాంతాన్ని పర్యాటకంగా చాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందనీ కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానికంగా ఉన్న మత్స్యకారులు అభివృద్ధి అవుతారనీ, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆదాయ వనరుగా ఉంటుందన్నారు. ఈ నెల 18,19 మరియు 20 తారీకులలో మొత్తం మూడు రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలకి స్పోర్ట్స్, వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పర్యాటక ప్రేమికులకి అదే విధంగా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ బోటింగ్ అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్, అనేక రకమైనటువంటి మంచి స్టాల్ లు ఏర్పాటు చేశామనీ, శ్రీ సిటీలో కూడా ఈసారి పెద్ద ఎత్తున సి ఎస్ ఆర్ కాంక్లేవ్ ఏర్పాటు చేసామనీ, ప్రముఖ బాంబే ఎన్జీఓ ప్రముఖ పర్యావరణ వేత్తలను, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామని పులికాట్, నేలపట్టు తాలూకా విశిష్టతను వాళ్లకు చెప్పి దీన్ని ఇంకా వచ్చే కాలంలో ఎలా అభివృద్ధి చేయాలి అని, ఒకవైపు ప్రజల సంక్షేమం మరొక వైపు ప్రాంతీయ అభివృద్ధి సమపాలల్లో అభివృద్ధి చేయడంతో పాటుగా, పర్యావరణాన్ని కాపాడడం ఈ మూడింటిని కూడా చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి సలహాలు సూచనలతో ప్రణాలికలు తయారు చేయనున్నామని అన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి మాట్లాడుతూ...ఒక సంకల్పంతోటి ఒక ప్రాంతం తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ గారు శాసనసభ్యులు శ్రీమతి విజయశ్రీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తక్కువ సమయంలో సైతం అధికార యంత్రంగం నడిపించి ఇవాళ మూడు రోజులు పండగ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిన్నటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా తాను ఉన్నాను అని గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకులను, పర్యాటకుల్ని , ప్రకృతి ప్రేమికులను , పక్షుల ప్రేమికులను గాని అందర్నీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లా యంత్రాగం, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయి, ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించి అనేక ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటిగా ఈ ఫ్లెమింగో ఉత్సవాలను నిర్వహించడం రాష్ట్రంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం మొదట్లో ప్రదర్శించిన ఆడియో విజువల్ చాలా అద్భుతంగా ఉన్నదని తెలిపారు. అక్కడ ఫ్లెమింగ్ పక్షులు, నేలపట్టు ప్రాంతం, పులికాట్ సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సులు చూడటం కళ్ళకు విందుగా ఉంటుందని తెలిపారు.
ఈ పక్షులు నాలుగైదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయని, వాటికీ కులమత బేధాలు లేవు లేకుండా అందరూ కలిసి ఒకటే భావంతోటి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటికీ సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి కనువిందు అయినటువంటి కార్యక్రమాన్ని పులికాట్ సరస్సు అటకాని తిప్ప, నేలపట్టు ఎంతో అద్భుతంగా పక్షులకి ఆలవాలం అని అన్నారు. బి వి పాలెం వద్ద బోటింగ్ ఏర్పాటుతో పర్యాటకుల్ని కను విందు చేయనున్నాయి అన్నారు. వాటికి సంబంధించి వాటన్నిటిని కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు రూపొందించారు అన్నారు. దాంతో పాటు పూర్తిగా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా అందరీ బాధ్యత అన్నారు. ఈ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు, వివిధ స్టాల్ లు ఏర్పాటు చేశారు. చాలా తక్కువ సమయంలో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక పక్కన రాజకీయ నాయకులు, జిల్లా యంత్రాగానికి నేను పర్యాటక శాఖ మంత్రిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
మత్స్య కారుల జీవన ఉపాధికి కూడా పులికాట్ సరస్సు మీద ఆధార పడి జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
ఈ ప్రాంతములో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. టూరిజం ఇండస్ట్రీగా గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు. పీపీపీ మోడల్ తో పాటు ఇప్పుడు మన ముఖ్యమంత్రి p4 మోడల్ మీద అందరూ పని చేయాలని పబ్లిక్, ప్రైవేట్ ప్యూపిల్స్ పార్టనర్షిప్ నుంతీసుకొచ్చారని అన్నారు. అందులో భాగంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.
2020 ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా పడిపోయిందని, ఒక్కరోజు కూడా పర్యాటక శాఖ మంత్రులు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఇతర విభాగాలు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనందరికీ కూడా పర్యాటక అభివృద్ధి జరగడానికి వీలుగా కార్యక్రమాలను రూపొందించడానికి నాంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చేసింది అవుతుందనీ, నేను ఈ కార్యక్రమానికి ఈ రోజు రాకపోతే చాలా గొప్ప కార్యక్రమాన్ని నా జీవితంలో మిస్ అయిపోయిన అనేటువంటి భావన కలిగి ఉండేది తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యాటక రంగ అభివృద్ధి చేద్దాం అందులో ప్రధానంగా ఆలోచిస్తున్నది యువతకి ఉపాధి కల్పించడం ఎప్పుడైతే పర్యాటకరంగా వృద్ధి చెందుతుందో నూటికి నూరు శాతం కూడా అన్ని రంగాల కంటే కూడా ఎక్కువగా యువతకి ఉపాధి కల్పించగలిగేటువంటి రంగం పర్యాటక రంగం దాన్ని ముందుకు తీసుకెళదాం అన్నారు. చక్కగా ఏర్పాట్లు చేసిన అందరికీ, మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రజా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి, ఎంఎల్ఏ, కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్శించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో మంత్రితో పాటు మున్సిపల్ చైర్మెన్ శ్రీమంత్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఏం.ఎల్.సి. వాకాటి నారాయణ రెడ్డి, ఆర్. డి. వో కిరణ్మయి, ఆర్డి టూరిజం రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారి సూళ్లూరుపేట హారిక, సంబంధిత అధికారులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. జిల్లా కలెక్టర్ జేసి వాలీ బాల తదితర క్రీడలలో పాల్గొని అందరినీ ఉత్తేజ పరిచారు.
----------------------------------------
డి.ఐ.పి.ఆర్.వో తిరుపతి