భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు.
జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన్.టి.ఆర్. వ్యక్తిత్వాన్ని ప్రతిభింబిస్తుందని, సినిమా రంగంలో ఉన్నవారు, రావాలనుకునేవారు తప్పనిసరిగా చదవ వలసిన గ్రంథమని చెప్పారు.
రచయిత బీరం సుందర రావు మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. మహనీయ కళాకారుడని, ఆయన పోషించిన పాత్రలను ప్రపంచంలో మరే ఇతర కళాకారులూ తరించి మెప్పించలేరని చెప్పారు. తారకరామం అన్నగారి అంతరంగాన్ని ప్రతిభింబించే అరుదైన అపురూప గ్రంథమన్నారు.
నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ అన్నగారి ఇంటర్వ్యూలను తారకరామం రూపంలో తీసుకురావటం నిజంగా చాలా మంచి ప్రయత్నమని, ఇది భావితరాలకు పరిశోధనకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రచయిత భగీరథను కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ ను ఆయన అభినందించారు.
రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ తారకరామం పరిశోధనాత్మక గ్రంథమని, రచయిత ఈ విషయంలో భగీరథ ప్రయత్నమే చేశాడని చెప్పారు. తారకరామంకు జ్ఞాన్ పీఠ్ అవార్డు ఇవ్వటానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆయన చెప్పారు.
కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ అన్నగారి అంతరంగాన్ని తెలిపే ఇంటర్వ్యూలతో మేము వెలువరించిన తారకరామంపై వస్తున స్పందన చూసి ఎంతో సంతృప్తి కలిగిందని, తారకరామం ఆలోచన, శ్రమ అంతా భగీరథ గారిదేనని అన్నారు.
రచయిత భగీరథ మాట్లాడుతూ తారకరామం పుస్తకంపై వస్తున్న స్పందన చూసిన తర్వాత తాము పడ్డ శ్రమంతా మరచిపోయామని అన్నగారిని భవిష్యత్ తరాలకు చూపించాలనే సంకల్పంతోనే తారకరామంను వెలువరించామని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో దర్శకుడు వీర శంకర్, ఆర్టిస్ట్ డాకోజు శివప్రసాద్ కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ సభను నిర్వహించారు. ఎన్.టి.ఆర్. కమిటీ సభ్యుడు దొప్పలపూడి రామ మోహన రావు వందన సమర్పణ చేశారు.