పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. హరి హర వీర మల్లు చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మాట వినాలి అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు ఆవిష్కరించారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం.
సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే మాట వినాలి లిరికల్ వీడియోతో హరి హర వీర మల్లు సంగీత ప్రయాణం మొదలైంది. వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ చెప్పే హృద్యమైన పంక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్ లతో మాట వినాలి గీతం మనోహరంగా ఉంది. పెంచల్ దాస్ అందించిన సాహిత్యం లోతైన భావాన్ని కలిగి ఉంది. మంచి మాటలను వినడం మరియు వాటి నుండి వచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అద్భుతమైన సందేశంతో ఈ పాట సాహిత్యం నడిచింది. ప్రతి వాక్యం విలువైన జీవిత పాఠాలను అందిస్తుంది. జీవితంలో సానుకూలత మరియు ధర్మాన్ని స్వీకరించడానికి శ్రోతలను ప్రోత్సహిస్తుంది.
అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన మాట వినాలి పాట విజువల్స్ ఆకట్టుకున్నాయి. అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ మనోహరమైన, ఆకర్షణీయమైన గీతం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా ఉంది. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా ఆలపించి ఈ పాటకు మరింత అందాన్ని జోడించారు. తనదైన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను కట్టిపడేసేలా చేశారు.