Advertisement

టాలీవుడ్ దెబ్బ అదుర్స్ కదూ..!

Thu 03rd Oct 2024 10:15 PM
konda surekha  టాలీవుడ్ దెబ్బ అదుర్స్ కదూ..!
Tollywood blow sounds bad..! టాలీవుడ్ దెబ్బ అదుర్స్ కదూ..!
Advertisement

హైదరాబాద్ మహా నగరంలో మూసీ నది దారి తప్పి.. ఓ మంత్రి నోటిలోంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే..! దీంతో మూసీతో పాటు ఆ నోటిని కూడా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ సర్వత్రా వస్తోంది..! ఇంతకీ ఎవరు ఆ మంత్రి.. ఏం మాట్లాడారు..? అనే విషయాలు మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా. మంత్రి కొండా సురేఖ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుంచి విమర్శిస్తూ అక్కినేని నాగార్జున ఫ్యామిలీని లాగడంతో ఒక్కసారిగా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతి ఒక్కరూ స్పందించి మంత్రితో పాటు రేవంత్ ప్రభుత్వానికి కూడా గట్టిగానే గడ్డి పెట్టారు. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో.. టాలీవుడ్ దెబ్బ మాత్రం అదుర్స్ అంతే. ఎందుకంటే బహుశా ఇంతలా యూనిటీ, ఈ రేంజిలో స్పందన ఏ విషయాల్లో బహుశా మనం చూసి ఉండమనుకుంటా..!

ఎటు నుంచి ఎటు..!

గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొండ సురేఖ మాట్లాడిన పాడు మాటలే వినిపించాయి.. కనిపించాయి. ఎందుకంటే.. ఊర్లలో పంపు కుళాయిల దగ్గర మాట్లాడుకునే వాళ్ళు కూడా అసహ్యించుకునేంతలా అంత దరిద్రంగా మంత్రి మాట్లాడారు. మాట్లాడిన మాటలకు నోరు శుద్ధి చేసుకొని వచ్చి మీడియా ముఖంగా వచ్చి అక్కినేని ఫ్యామిలీ, సమంతకు క్షమాపణ చెప్పాలని సొంత పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలే డిమాండ్ చేశారు అంటే ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిన్న చిన్న నటీ నటుల నుంచి పెద్ద నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలు ముక్త కంఠంతో మంత్రి మాటలను ఖండించారు. నిజంగా ఒక్కొక్కరు ఖండించిన తీరు నిజంగా శభాష్ అనిపించుకునేలా ఉంది.

దెబ్బకు.. క్షమాపణ!

నాగార్జున ట్విట్టర్ వేదికగా అలా స్పందించగానే గంటల వ్యవధిలోనే వందల మంది నటులు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ పెద్ద ఎత్తున స్పందించారు. ఇక లోకల్ నుంచి జాతీయ మీడియా వరకూ పెద్ద పెద్ద ఎత్తున వార్తలు వచ్చేశాయ్. మరోవైపు క్యాడర్ మొదలుకుని హైకమాండ్ వరకూ ఒక్కటే ఫోన్లు రావడంతో దెబ్బకు వెనక్కి తగ్గిన కొండా సురేఖ.. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ  మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా అన్యతగా భావించవద్దు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం  అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని ట్విట్టర్, మీడియా వేదికగా సమంతకు క్షమాపణ చెప్పారు మంత్రి. 

సద్దుమణిగిందా..? 

ఐతే క్షమాపణతో వివాదం సద్దుమణిగిందా అంటే.. ఎందుకు, ఎక్కడ సద్దుమణిగింది? అనే ప్రశ్నలు మళ్ళీ వస్తున్నాయ్. ఎందుకంటే మంత్రి.. సమంతపై చేసిన వ్యాఖ్యలు మాత్రమే వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు అంతే.. కానీ నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు కాదు కదా. నిజానికి అక్కినేని ఫ్యామిలీపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత అంతకు రెట్టింపు.. వాటి గురించి మంత్రి ఏమీ చెప్పలేదు కదా? అనే మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక వనితగా ఇంకో వనితకు ఆసరా కావాలి కానీ భారం కాకూడదు.. పాలిచ్చే తల్లులు,‌ మీకు పరిపాలించడం ఓ లెక్క అని, మీకు ప్రజాదరణ ఇచ్చారు, దానిని సద్వినియోగం చేసుకోవాలి కానీ, చీదరగా అసభ్య వ్యాఖ్యలు సరి కాదని మంత్రిని తిట్టి పోస్తున్నారు. 

కుదోస్ టాలీవుడ్..!

ఈ మాత్రం వ్యవహారంలో సినీ ఇండస్ట్రీ స్పందించిన తీరుకు సలాం చేయాల్సిందే. కలిసుంటే కలదు సుఖం.. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖను కడిగేసిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఇదే కాదు రేపు పొద్దున్న కూడా రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగినా.. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి రావల్సిన, కావాల్సిన విషయంలో కూడా ఇదే యూనిటీ ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా.. సినిమా పరిశ్రమ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాగితే ఇలాగే రియాక్షన్ ఉంటుందని ఈ దెబ్బతో తెలిసిరావాలి.. అంతేకాదు మరోసారి ఇలా ఇష్టానుసారం మాట్లాడాలంటే భయపడాలి అంతే. ఇకనైనా.. స్వార్థ రాజకీయాల కోసం సినీ ప్రముఖుల పేర్లు, వారి జీవితాలను వాడుకోకండి.. మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పే.. అనే విషయాలు తెలుసుకుంటే మంచిది మరి.

కళ్ళు తెరిచి ఇటు చూడండి!

ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన మంత్రి.. పాఠశాల బాలికలకు మరుగుదొడ్లు లేవు వాటి గురించి ఏనాడైనా మాట్లాడారా?.. మహిళలకు సురక్షితమైన పని పరిస్థితులు లేవు వాటి గురించి ఏనాడైనా ఆలోచించారా?.. ఆడ బిడ్డలపై వేధింపులు, అత్యాచారాలు, హింస, హత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి.. వాటి గురించి ప్రస్తావించాల్సింది పోయి లేని పోని అబద్ధపు ఆరోపణలు చేయడం సమంజసమా..? ఒక మహిళను ఘోరంగా నిందించిన మీరు మహిళలను ఏం ఉద్ధరిస్తారు..? ఇకనైనా ఈ లేనిపోని ఆరోపణలు, నిందలు మాని రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయ్ వాటిపై దృష్టి పెడితే మంచిదని సామాన్యుడి హితవు పలుకుతున్నారు. ఇంత జరిగినా తర్వాత ఐనా ఒక్క కొండా సురేఖ లోనే కాదు.. రాజకీయ నేతల్లో, విమర్శకులలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మార్పు వచ్చి తీరాల్సిందే.

 

 

 

Tollywood blow sounds bad..!:

Film industry expresses anger against minister Konda Surekha

Tags:   KONDA SUREKHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement