ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) గెలిస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నది పక్కా. ఇక ఆ తర్వాత వరుసలో ఉన్న యువనేత నారా లోకేష్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితేంటి..? అన్నది ఇప్పుడు అన్ని పార్టీల శ్రేణులు, అభిమానుల నుంచి మెదులుతున్న ప్రశ్నలు. దీనిపై సోషల్ మీడియా వేదికగా.. టీడీపీ వర్గాల్లో చిత్ర విచిత్రాలుగానే టాక్ నడుస్తున్నప్పటికీ ఇంతలా కష్టపడిన తమ అభిమాన నేతకు ప్రాధాన్యత ఉండే పదవి ఉండాల్సిందే. అది కూడా పిఠాపురం నుంచి గెలిచినా.. ఓడినా సరే మంచి హోదా ఇవ్వాల్సిందేనన్నది జనసేన శ్రేణుల డిమాండ్. ఆ లెక్కన పెట్టుకుంటే పవన్‌కు ఇచ్చే పవర్ ఏంటి..? అనే ప్రశ్నకు చాలా మంది నుంచి హోం శాఖ అనే సమాధానం వస్తోంది. దీంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది.
సీఎం కావాల్సిందే..!
ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టీల కలయిక కాబట్టి.. కూటమి గెలిస్తే అన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. బీజేపీతో పోలిస్తే కచ్చితంగా పవన్ పాత్ర మాత్రం కీలకమే. ఎందుకంటే.. అబ్బే కూటమి అక్కర్లేదు వద్దంటే వద్దు అన్న పరిస్థితి నుంచి ఢిల్లీకి రండి మాట్లాడుకుందాం అని కమలనాథులే ఫోన్లు చేసి పిలిపించుకున్న పరిస్థితికి తెచ్చింది మాత్రం సేనానీయే.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వందుకు వెయ్యి శాతం నిజమే. ఇక ఎన్నికల ప్రచారంలో అయితేనేం.. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టడంలో తగ్గేదేలా అంటూ చెలరేగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలన్నది పవన్ మనసులో గట్టిగా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్న.. చేసిన సేనానికి కచ్చితంగా రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలన్నది జనసైనికుల డిమాండ్.
లోకేష్ కథేంటి..?
కూటమిలో నంబర్ వన్ చంద్రబాబు అయితే.. నంబర్ టూ స్థానంలో పవన్, లోకేష్‌లు ఉన్నారు. చినబాబుకు ఈసారి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. మంగళగిరిలో గెలిస్తే ఏ మంత్రి పదవి ఇవ్వొచ్చన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. దీనికి చాలా మంది టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న ప్రశ్న మాత్రం ఐటీ శాఖ ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. ఎందుకంటే గతంలో పనిచేసిన అనుభవం.. పైగా పరిశ్రమల లేమితో సతమతమవుతున్న ఏపీకి సరైనోడు యువనేతేనని చెప్పుకుంటున్నారు. ఇక ఐదేళ్లలో కనీసం ఆరు నెలలు లేదా ఏడాది పాటు సీఎంగా చేయాలని కూడా లోకేష్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది లోకేష్‌కు ఛాలెంజింగ్ కాబట్టి.. ఒకసారి పగ్గాలు ఇచ్చి చూస్తే నాయకత్వం ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది మరి. ఇక చంద్రబాబు మనసులో ఏముంది..? ఢిల్లీలోని అగ్రనేతలు ఏమంటారు..? అనేది చూడాలి మరి.