భారత అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి చిరు చేసిన కృషి, రాజకీయాలపై.. విమర్శకులకు గట్టిగానే ఇచ్చిపడేశారు. 45 ఏళ్ల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డ్ ఇచ్చిందని.. ఈ ఉన్నతికి కారణమైన అభిమానులు, ప్రేక్షకులు ,దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఏ టైమ్‌కు ఏది రావాలని ఉంటే.. అది వస్తుందని.. తాను దేని కోసం ఎదురు చూడలేదన్నారు.
భారతరత్న రావాల్సిందే..!
స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగాస్టార్ మీడియా ముఖంగా తెలిపారు. భారతరత్న అవార్డు వారికి ఇవ్వటం సముచితమని, ఎంజీఆర్‌కు వచ్చినపుడు, ఎన్టీఆర్‌కు కూడా రావాల్సిందేనన్నారు. కాగా.. అవార్డుల ప్రకటన వచ్చిన ప్రతిసారీ భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం.. ఆ తర్వాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. అయితే అభిమానులు కానీ.. ఆయన కుటుంబ సభ్యులుగానీ ఇంతవరకూ ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేసిన సందర్భాల్లేవు. అయితే మెగాస్టార్ మాత్రం తన మనసులోని మాటను బయటపెట్టేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలకు ఓ సలహా కూడా చేశారాయన. కూటమి ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్‌కు భారతరత్నపై ఆలోచన చేయాలని కోరారు.
రాజకీయాల్లో లేను!
తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని.. ఏ పార్టీలో లేనన్న విషయాన్ని బల్లగుద్ది మరీ చిరు చెప్పేశారు. పవన్‌కు తానున్నానని చెప్పాడానికే ఆ వీడియో సందేశం పంపామన్నారు. అయితే.. తాను పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం సపోర్ట్ పవన్‌కు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అంతేకాదు.. తాను ఎన్నికల ప్రచారానికి రావాలని కళ్యాణ్ బాబు కూడా కోరుకోలేదన్న విషయాన్ని కూడా చిరు చెప్పారు. కల్యాణ్ ఎప్పుడూ బాగుండాలని, జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటున్నాని మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తమ్ముడు రాజకీయంగా ఎదగాలని కుటుంబం మనసా వాచా కోరుకుంటోందన్నారు.ఇదిలా ఉంటే.. పద్మవిభూషణ్ అవార్డు అందుకుని చిరు రికార్డ్ బ్రేక్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్‌లో ఈ అవార్డు అందుకున్న రెండవ నటుడు చిరంజీవి కావడం విశేషమని చెప్పుకోవచ్చు.