భద్రాచలం: మానవ జీవన వ్యవస్థలో అవస్థల్ని తొలగించే మహా శక్తిమంతమైన స్తోత్రమ్‌గా తర తరాలుగా అనేక అద్భుతాల్ని ఆవిష్కరించిన శ్రీరామరక్షా స్తోత్రమ్ అపురూప గ్రంధాన్ని తన సమర్ధవంతమైన వ్యాఖ్యాన వైఖరీ సొగసులతో పరమాద్భుతంగా అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas)ని, ఈ దివ్య గ్రంధాన్ని వ్యాపార స్వార్ధాలకు అతీతంగా ఎంతో సమర్పణా భావంతో జంటనగరాల్లోని ఆలయాలకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అనేక నగరాల, పట్టణాల, మారుమూల ప్రాంతాల ఎన్నో శ్రీరామాలయాలకు చేర్చిన మాజీమంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah)ని వేదపాఠశాలల విద్యార్థులు, ఆలయాల అర్చక ప్రముఖులు మనసారా అభినందిస్తున్నారు.
కేవలం శ్రీరామరక్షాస్తోత్రం మాత్రమే కాకుండా రఘురాముని అభయాన్ని వర్షించే శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రమ్, భయాన్ని తొలగించే కోదండ రామాస్త్రం స్తోత్రమ్, మహావీర హనుమంతుని పరాక్రమ సౌందర్యంతో రక్షించే శ్రీ మారుతీ స్తోత్రమ్, శ్రీ ఆంజనేయభగవానుని విశేషానుగ్రహాన్నిచ్చే హనుమాన్ చాలీసాలకు అద్భుతమైన సౌందర్యవంతమైన భాషతో కూడిన వ్యాఖ్యానంతో ఈ శ్రీరామరక్షాస్తోత్రం (Srirama Raksha Stotram) గ్రంధాన్ని ఎంతో చక్కగా అందించారు పురాణపండ శ్రీనివాస్.
ఏదో మొక్కుబడిగా కీర్తికోసం అందించే చాలామంది బుక్స్‌లా పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలు వుండవనేది భక్త పాఠకులకు ఎరుకే. ఈరోజు చాలామంది ఉపన్యాసకులు, పండితులు, పీఠాధిపతులు తమ ప్రసంగాల బయట ఒక కౌంటర్‌ని పెట్టి తమ రచనల్ని అమ్మడం అనేక చోట్ల చూస్తుంటాం. రెండున్నర దశాబ్దాలుగా ఎక్కడా స్వార్ధాన్ని తన దగ్గరికి అస్సలు రానివ్వకుండా ఎన్నో ఎన్నెన్నో మహాద్భుతమైన పారమార్ధిక దైవీయ గ్రంధాలను పురాణపండ శ్రీనివాస్ అందించే తీరు వెనుక దైవబలం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని రాజకీయ సినీరంగ సాహితీ రంగ ప్రముఖులెందరో స్పష్టంగా పేర్కొంటున్నారు.
ఈ శ్రీరామనవమికి ముందే భద్రాద్రి మొదలుకొని ఎన్నెన్నో జిల్లాల ఆలయాల్లో శ్రీరామ రక్షా స్తోత్రమ్ భక్తులమధ్య ఊరేగుతూ కనిపించడం, అప్పుడే వందలాది భక్తులు పారాయణ మొదలు పెట్టడం కేవలం శ్రీరామచంద్రభగవానుని అనుగ్రహమేనంటున్నారు పురాణపండ శ్రీనివాస్. అంతేకాకుండా ... ఆలయాలకు, వేద పాఠశాలలకు, సాంస్కృతిక సంస్థలకు, భక్త సమాజాలకు ఈ శ్రీరామరక్షా స్తోత్ర గ్రంధాన్ని ఒక్కొక్క సంస్థకు డెబ్బై ప్రతులను ఉచితంగా అందించాలని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం (Gnana Maha Yagna Kendram) సంకల్పించడం విజయ పరిణామమంటున్నారు విజ్ఞులు.
ఈ అఖండమైన శ్రీరామరక్షా స్తోత్రాన్ని ప్రపంచంలోని తెలుగు భక్తులకు పరిచయంచేసిన మొదటి వ్యక్తి విఖ్యాత ఆధ్యాత్మికవేత్త పురాణపండ రాధాకృష్ణమూర్తి (Puranapanda Radha Krishna Murthy) అని, ఆ పరంపరని అద్భుతమైన రీతిలో అత్యంత సమర్ధవంతంగా కుమారుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కొనసాగించడం ఈరోజుల్లో మామూలు విషయంకాదని సాక్షాత్తూ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సైతం అభినందించారు.
తమ సంస్థ లెటర్ పాడ్‌పై జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం, భాగవతమందిర సదనం, శ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి గారి వీధి, రాజమహేంద్రవరం - 533104 అనే చిరునామాకు లేఖ రాసి శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కోరిన వారికి డెబ్బై ప్రతులను ఉచితంగా అందజేస్తామని సంస్థ ప్రకటించింది. ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవంలో సుమారు ముప్పైవేల శ్రీరామరక్షా స్తోత్రమ్ ప్రతులు కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులకు, ఉభయదాతలకు, భక్తులకు అందజేయనున్నట్లు ఇప్పటికే శ్రీ సీతారామ చంద్ర దేవస్థాన జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఎల్. రమాదేవి ప్రకటించారు. ఈ అంశంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, అపురూపగ్రంధ సమర్పకులు బొల్లినేని కృష్ణయ్యకు దేవస్థానం కృతజ్ఞతలు ప్రకటించింది.
రాజకీయంగా, వైద్య సేవలపరంగా దేశ దేశాల్లో ఎంతో పలుకుబడి సంపాదించిన బొల్లినేని కృష్ణయ్య పురాణపండ శ్రీనివాస్‌తో కలిసి ధార్మిక సేవ శాశ్వతమైనదని కమ్మసంఘాల ప్రముఖులు కృష్ణయ్యను ప్రత్యేకంగా ప్రసంశిస్తున్నారు.