సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్ర మోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆయన కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23, మే 1945 లో పుట్టారు, చంద్రమోహన్ వయసు (82). ఆయన మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు.1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న ఆయన 1987లో చందమామ రావే కోసం నంది అవార్డు అందుకున్నారు. అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు, 2005లో పదహారేళ్ల వయసు సినిమాలో నటించినందుకుగానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ఫేమస్ అయ్యారు.
55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్.. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచించారట. సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసును చిత్రాలని ఎప్పటికి మర్చిపోలేనన్న చంద్రమోహన్, తన తల్లి చనిపోయేసమయంలో మనసంతా నువ్వే సినిమా కోసం కాంబినేషన్ సీన్ చేస్తున్నారట. డబ్బులు దాచుకున్నవారికే విలువ ఉంటుందని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు.
గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్.. కొద్దిరోజులుగా కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో హృద్రోగంతో తుది శ్వాస విడిచారు.