అన్ని రాష్ట్రాల సీఎంలు వేరు.. ఏపీ సీఎం జగన్ వేరు. ఇక్కడ కక్షలూ కార్పణ్యాలకు తప్ప అభివృద్ధికి చోటుండదు. జనాన్ని సోమరిపోతుల్ని చేయడం తప్ప శాశ్వత ఉపాధిని చూపించడం ఉండదు. భవనాల్ని పడగొట్టడం తప్ప.. కట్టడం ఉండదు. మూడు రాజధానులంటూ మురిపించడం తప్ప.. అసలు ఒక్క రాజధానికే దిక్కు లేకుండా చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు ఊసే ఉండదు. మౌలిక వసతుల కల్పనకు ఛాన్సే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలే. ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణకు చోటే లేదు. ఎంతసేపే హస్తినకు పోవాలే.. అప్పులు అడుక్కోవాలే.. సంక్షేమ పథకాల పేరిట కొంత పంచి కొంత నొక్కాలి. అదేమంటే ప్రతిపక్షాలను కేసుల పేరిట జైళ్లలో తోసి బయటకు రాకుండా చేయాలి.
ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతిని కళ్ల ముందే కాల రాస్తుంటే ఏం చేయాలో పాలుపోక జనం మిన్నకుండిపోయారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులతో ఊరుకుంటుందేమో అనుకున్నారు కానీ పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పూనుకున్నారు. అంతటితో ఆగుతారేమో అనుకుంటే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలపై కేసులు.. కేవలం సంక్షేమంతో గెలవడం కష్టమని విషయం బోధ పడటంతో సామ, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తోంది జగన్ సర్కారు. ప్రతిపక్ష నేతలు సభలు పెడితే ఓర్వలేక పార్టీ కేడర్ చేత రచ్చ రచ్చ చేయించింది. అయినా కళ్లు చల్లారలే.. ఏకంగా కేసులకు తెగబడింది. మొత్తానికి తాము అనుకున్నది అనుకున్నట్టు జగన్ సర్కార్ చేసుకుంటూ పోతోంది. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇంతటి విధ్వంసమా? అని ప్రజలే నోరెళ్లబెడుతున్నారు.
అసలు ఓటేసిన పాపానికి జనానికి దక్కిన ఫలితం ఏంటి? తమ పిల్లలకు ఉద్యోగాలిప్పించగలిగారా? పోనీ తమ ఇంట్లోని ఉద్యోగస్తులను సుఖంగా ఉండనిచ్చారా? ఇసుక దందాతో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. దీంతో ఎందరో భవన నిర్మాణ కార్మికులు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పదవిని అడ్డుపెట్టుకుని సీఎం కాదు.. మంత్రులు సైతం పగ ప్రతికారాలు సాధిస్తూ సామాన్య జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టే క్రమంలో సమిధలవుతోంది మాత్రం ప్రజలే. ఇసుక దందా కారణంగా ఇబ్బందిపడుతున్నది ప్రజలే. అమరావతి నిర్మాణాలను అడ్డుకోవడంతోనూ ప్రజలే బలవుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదలైన వికృత క్రీడ ప్రభుత్వం అంతమైతే కానీ పోయేలా లేదు. ఇంత చేసిన ప్రభుత్వాన్ని వదిలేది లేదని నెక్ట్స్ అధికారంలోకి వచ్చిన వేరే ప్రభుత్వం భావిస్తే..? మళ్లీ ప్రజలే కదా ఇబ్బందుల్లో కూరుకుపోయేది. తాను తలపెట్టిన కక్షాయజ్ఞంలో అంతిమంగా సమిథలవుతోంది ప్రజలేనని జగన్ గుర్తిస్తే మంచిది.