గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం కాంతార అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావటంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అన్నీ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారారు. ఇప్పుడు ఆయన కాంతార 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి ప్రగతి రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా బెంగుళూరులో రిషబ్ పుట్టినరోజు వేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రిషబ్ శెట్టి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పల్లెటూరి నుంచి కలల్ని మూటగట్టుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడిని నేను. ఇవాళ మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. కన్నడ ప్రేక్షకులు ఆదరించడం వల్లనే ఈ సినిమా గ్లోబల్ సినిమా అయింది. ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నాను. ఇవాళ నా పుట్టిన రోజు సందర్భంగా అది సాకారమైంది. నా కోసం, నన్ను చూడటం కోసం అభిమానులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నిలుచున్న తీరు నా మనసును తాకింది. వాళ్ల అంకిత భావం పట్ల గౌరవం పెరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వారి అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను. ఆ రుణం తీర్చుకోలేనిది. నా అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నా భార్య ప్రగతి శెట్టికి, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రమోద్ శెట్టికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.
ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ చాలా ఏళ్లుగా కర్ణాటకలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రిషబ్ శెట్టి తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఆ విషయాన్ని ఎప్పుడూ మీడియాతో పంచుకోలేదు అని అన్నారు. రిషబ్ శెట్టి సతీమణి ప్రగతిశెట్టి ఇదే వేదిక మీద కీలక ప్రకటన చేశారు. రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ని ఆమె అనౌన్స్ చేశారు. విద్యా ప్రాముఖ్యతను చాటడానికి ఈ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తన భర్తకు పుట్టినరోజు కానుకలు అందుకోవడం నచ్చదని తెలిపారు.
కర్ణాటక మాత్రమే కాదు, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు రిషబ్ శెట్టిని కలుసుకోవడానికి తరలి వచ్చారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు తరలి వచ్చిన తీరు చూసి సంబరపడిపోయారు రిషబ్‌శెట్టి. నిజమైన అభిమానం అంటే ఇదేనని వారితో ఆత్మీయంగా సమయాన్ని గడిపారు.
గంటలతరబడి ఆయన వేదిక మీద నిలుచుని ఫ్యాన్స్ ని పేరు పేరునా పలకరించిన తీరుకు అభిమానులు ఆనందంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో టైగర్ డ్యాన్స్, ఛేడ్ ప్రోగ్రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కాంతార సక్సెస్‌ని కన్నడ ప్రేక్షకులకు అంకితమిచ్చారు రిషబ్ శెట్టి.