విజయవాడ నగరంలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎన్. టి. ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు టి. డి. జనార్దన్ నాయకత్వం లో ఈ వేడుకలను నిర్వహించారు. రామారావు గారు శాసన సభలో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఈ కమిటీ తీసుకువచ్చింది.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు, అల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, యువరత్న నందమూరి బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ఎస్. వెంకట నారాయణ, నందమూరి మోహన కృష్ణ, నందమూరి రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి ఈ వేడుకల్లో అతిధులుగా పాల్గొన్నారు.
నందమూరి తారక రామారావు జీవితం పై నాజర్ కుమారుడు బాబ్జి రూపొందించిన బుర్రకథను, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన. మనదేశం, మాయాబజార్ స్కిట్ లకు గుమ్మడి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. కంఠంనేని రవిశంకర్ రూపొందించిన తెల్ల అన్నం షార్ట్ ఫిలిం, అట్లూరి నారాయణ రావు రూపొందించిన జయహో ఎన్. టి. ఆర్. పాట, ఎన్. టి. ఆర్. జీవితంపై రూపొందించిన ఆడియో విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అత్యంత భారీగా రూపొందించిన ఎన్. టి. ఆర్ శత జయంతి కార్యక్రమానికి 50 వేలమంది ప్రేక్షకులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు రావడంతో ప్రేక్షకులు అనడంతో, ఉద్వేగంతో కేరింతలు కొట్టారు. అరగంటకు పైగా తెలుగులో సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకున్నది. రజనీకాంత్ 47 సంవత్సరాల తరువాత విజయవాడ వచ్చారు. 1976లో కె. బాల చందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథ సినిమా శత జయంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు. 47 సంవత్సరాల తరువాత రజనీ రావడం తెలుగులో అనర్గళంగా మాట్లాడటం, సీనియర్ ఎన్. టి. ఆర్ తో, చంద్ర బాబు నాయుడుతో తనుకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ముఖ్యంగా చంద్ర బాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరమని రజనీకాంత్ చెప్పారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తమ తండ్రి ఎన్. టి. ఆర్ శత జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
కమిటీ అధ్యక్షుడు టి. డి. జనార్దన్ మాట్లాడుతూ.. తమ కమిటీ గత ఎనిమిది నెలల నుంచి శ్రమిస్తుందని, అన్న నందమూరి తారక తామారావు ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని భావితరాలకు తెలియజేయాలనే సంకల్పం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
చంద్ర బాబు నాయుడు మాట్లాడుతో రామారావు గారి ప్రభావం తన మీద ఉందని, ఆయన ప్రాభవాన్ని ఇంత ఘనంగా తెలియజేసి వారికి నివాళులు అర్పించాడని కారణమైన కమిటీ అధ్యక్షుడు టి. డి జనార్దన్, షరీఫ్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, కంఠంనేని రవిశంకర్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్, భగీరథ, అట్లూరి నారాయణ రావు, మండవ సతీష్, డి. రామ్మోహన్, శ్రీపతి సతీష్, రఘురాం, మధుసూదన రాజు, పారా అశోక్ ను పేరు పేరున అభినందించారు. శ్రేయాస్ వారు సారధ్యం వహించగా ఈ భారీ కార్యక్రమానికి సుమ కనకాల వ్యాఖ్యానంతో సాగింది.
అదే రజనీ ప్రత్యేకత: ఈ కార్యక్రమానికి రావలసిందిగా నారా చంద్ర బాబు నాయుడు గారు తలైవా రజనీ కాంత్ ను ఆహ్వానించారు. చంద్ర బాబు నాయుడు గారి మీద గౌరవంతో రజనీకాంత్ విజయవాడ సభకు వస్తానని చెప్పారు అయితే ఏప్రిల్ 28న ఆయనకు సినిమా షూటింగ్ వుంది, నిర్మాత, దర్శకుడు ను పిలిచి ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ చెయ్యమని చెప్పారు. రజనీకాంత్ చెన్నయ్ నుంచి విజయవాడ రావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని చంద్ర బాబు నాయుడు గారు రజనీకాంత్ కు ఫోన్ చేసి చెప్పారు. అయితే రజనీకాంత్ చంద్ర బాబు నాయుడు అభర్ధనను సున్నితంగా తిరస్కరించారు. తాను ప్రత్యేక విమానంలో రానని, రెగ్యులర్ విమానంలో అందరి ప్రయాణికుల్లా వస్తామని చెప్పారు. అదికూడా తమ టికెట్ లను తామే కొంటామని, హోటల్ కు కూడా తామే డబ్బు కడతామని చెప్పారు. ఈ మాటతో రజనీకాంత్ ఎంత నిరాడంబరుడో, నిజాయితీ పరుడో అర్ధం అవుతుంది. అల్ ఇండియా సూపర్ స్టార్ గా వున్న రజనీకాంత్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధమవుతుంది .