ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ - సుమన్ టివి సినిమా విభాగం క్రియేటివ్ హెడ్ ప్రభు గిడుగు రామ్మూర్తి పంతులు జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని.. శంకరం వేదిక తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి చేతుల మీదుగా ప్రభు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభు తాజాగా రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాలకు పుస్తకాన్ని సభికులకు పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించారు. తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య - కళ - సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు మరియు గిడుగు రామ్మూర్తి పంతులు వారసురాలు శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి కళారత్న డా.బిక్కిన కృష్ణ, శంకరం వేదిక అధ్యక్షురాలు శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనాాయణ తదితరులు పాలుపంచుకున్నారు.