మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య, నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో పోరుకు సిద్ధమవుతుండగా, ఇరు హీరోల అభిమానులు మెయిన్ థియేటర్ల దగ్గిర బ్యానర్ లతో హంగామా స్టార్ట్ చేసేశారు. వీరసింహా రెడ్డి చిత్రానికి సంబంధించి అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తవగా, వాల్తేర్ వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు వైజాగ్ లో జరుగనుంది. రెండు సినిమాల ట్రైలర్లు ఫ్యాన్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం మరో ప్లస్ పాయింట్. ఇక రెండు సినిమాలకు సంబంధించి చివరి పాటలను ఈ నెల 10, 11 న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంతటితో ప్రమోషన్ల పర్వం పూర్తయినట్టే.
ఇండస్ట్రీ లో ఆసక్తికరమైన వార్త బాగా వినిపిస్తోంది. రెండు సినిమాల కోర్ పాయింట్ ఒకటే కానీ వేర్వేరు ట్రీట్మెంట్ లతో ఇద్దరు వీర లు తెరకెక్కారని తెలుస్తోంది. చక్కర్లు కొడుతున్న కథల ప్రకారం, వీరసింహా రెడ్డి లో బాలకృష్ణ తల్లి చనిపోగానే, తన తండ్రి మరో పెళ్ళి చేసుకోవడం. పినతల్లి కి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టడం జరుగుతుంది. చిన్నప్పటి నుండే అన్నంటే సరిపోని వరలక్ష్మి కాలక్రమేణా ఆస్తి కోసం, వీరసింహ రెడ్డి ను అంతమొందించడానికి తన ప్రత్యర్థి మొసళ్ళమడుగు ప్రతాప రెడ్డి ని పెళ్లి చేసుకుని బాలయ్యను చంపించడంతో కథ మలుపు తిరుగుతుంది. కానీ వారసుడిగా బాలసింహా రెడ్డి ఎంటర్ అవడం మరో ట్విస్ట్. ఇక తర్వాత ప్రత్యర్థులతో బాలయ్య ఎలా తలపడ్డాడు అనేదే కథ.
ఇక వాల్తేర్ వీరయ్య విషయానికి వస్తే, సత్యరాజ్ మొదటి భార్య కు పుట్టిన వాల్తేర్ వీరయ్య సరదాగా తిరిగే ఒక మత్స్యకారుడు. చిన్నపాటి స్మగ్లర్ కూడా. ఇక సత్యరాజ్ రెండో భార్య కు పుట్టిన రవితేజ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు. చిరు రవితేజ ఇద్దరూ ఢీ అంటే ఢీ అనుకునే పాత్రల్లో పరిచయం అవుతారు కానీ తన తమ్ముడికి సమస్య వచ్చినప్పుడు అన్నయ్య పూనుకుని ఎలా పరిష్కరించాడు అనేది మిగతా కథ. ఇందులో వీరయ్య అండర్ కవర్ కాప్ అనేది ట్విస్ట్ అంటున్నారు.