మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ స్టార్ డమ్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. గత మూడు దశాబ్దాలుగా ఇద్దరు అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న వారే, ఇద్దరికీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే బాలకృష్ణ మాస్ కమర్షియల్ సినిమాలకే పెద్దపీట వేయగా చిరంజీవి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అన్ని రకాల చిత్రాలు చేస్తూ వచ్చారు. అలాగే కన్సిస్టెన్సీ మైంటైన్ చేస్తూ చిరంజీవి నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగారు. కానీ, తనదైన సినిమా పడ్డప్పుడు బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టిస్తారో అందరికీ తెలిసిందే.
ఇక సంక్రాంతి బరిలో బాలయ్య - చిరంజీవి ఇప్పటివరకు ఏడుసార్లు పోటీ పడగా అందులో రెండుసార్లు బాలయ్య ఇండస్ట్రీ హిట్లు సాధించడం విశేషం. మిగిలిన అన్ని సందర్భాల్లో రెండు చిత్రాలు విజయవంతమైనా, కలెక్షన్ల పరంగా చిరంజీవి సినిమాలే ఒక మెట్టు పైనుండేవి. ఎనిమిదవ సారిగా ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య గా బాలయ్య వీర సింహారెడ్డి గా బరిలోకి దిగారు. రెండు సినిమాలు వారికి సరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో ఉండడం వలన అభిమానులు కూడా మంచి ఊపు మీద ఉన్నారు. వీర సింహారెడ్డి ట్రైలర్ నిన్న ఒంగోలులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల కాగా వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఇవాళ విడుదలైంది.
వీర సింహారెడ్డి ట్రైలర్ బాలయ్యకు సరిపోయే ఎలిమెంట్స్ తో పవర్ఫుల్ డైలాగ్స్ తో బాలకృష్ణ సినిమా నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏమి ఆశిస్తారో దానికి తగ్గట్లుగా ఉంది అలాగే వాల్తేరు వీరయ్య ట్రైలర్ కూడా చిరంజీవి మార్కు కామెడీతో, యాక్షన్ తో మంచి కమర్షియల్ ప్యాకేజ్ లా కనపడుతుంది. రెండు చిత్రాల ట్రైలర్లు బాగుండడం, అభిమానులు ఆశించే అన్ని అంశాలతో ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. పోరు మరింత రసవత్తరంగా మారింది. కంటెంట్ పరంగా ఎవరు మెప్పిస్తారో, కలెక్షన్ల పరంగా ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. మొత్తానికి ఈ సంక్రాంతికి థియేటర్ల దగ్గర పెద్ద మాస్ విస్ఫోటనమే జరగబోతోంది.