కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి జంటగా ఓ సినిమా మొదలయ్యింది. కలర్ ఫొటో నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి బెదురులంక 2012 టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని రివీల్ చేసారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు అన్నారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి అని చెప్పారు.