మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చిరంజీవిని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు. కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.