ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై మేజర్ గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను.
ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ... వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.
‘మేజర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేశ్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర,శ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు.