యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నాడు. నితిన్ ఎంట్రీ మూవీ కి శ్రీ శ్రీ శ్రీ రాజా వారు టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 2017లో శతమానం భవతి సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్ దీనికి దర్శకత్వం వహించారు.
నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తరువాతే శ్రీశ్రీశ్రీ రాజా వారు వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు హీరో నార్నే నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆలయ ఉత్సవాల నేపథ్యంలో సృజనాత్మ కంగా రూపొందించిన పోస్టర్ లో సైడ్ పోజ్‌లో చూపబడిన నార్నే నితిన్, రెడ్ చెక్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్, జీన్స్ ప్యాంట్ మరియు స్పోర్ట్స్ షూస్‌తో రగ్గడ్ లుక్‌లో ఉన్నాడు. జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అక్షరాలను సిగరెట్‌లా డిజైన్ చేయడంతో సినిమా లోగో క్యూరియాసిటీ ని మరింత పెంచింది. శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయ మవుతున్న నార్నే నితిన్ కు మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు సతీష్ వేగేశ్న పేర్కొన్నారు.