అవుట్ డోర్ షూటింగ్ అంటే ఆలోచించే హీరోలు కొందరు ఉంటారు కానీ బాలకృష్ణ మాత్రం సై అనేస్తారు. రై అని దూకేస్తారు. అదే ఆయన నైజం. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 18 NBK 107 షూటింగుని నేరుగా అవుట్ డోర్ లోనే స్టార్ట్ చేసేసారు. తెలంగాణలోని సిరిసిల్లలో బాలయ్య హంగామా షురూ అవగా.. అభిమానులు మాత్రం ఆగుతారా ఏంటి... ఫొటోలకి క్లిక్కిచ్చారు. వీడియోలూ లాక్కొచ్చారు.
దాంతో రాత్రయ్యేసరికి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. బాలయ్య లుక్ బయిటికి వచ్చేసింది. ఇక పెట్టిందెవరో కూడా పట్టించుకోకుండా రీట్వీట్లు కొట్టేస్తున్నారు అభిమానులు. లైకులకి లాకుల్లేకుండా పోయాయి. కామెంట్లు కట్టలు తెంచుకున్నాయి. బేసిక్ గా పైరెటెడ్ కంటెంట్ చట్టరీత్యా తప్పే కావచ్చు.. కానీ అభిమానుల ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనం ఆపగలమా..!
ఫైనల్ గా ఏ మాటకా మాట చెప్పుకోవాలి అంటే... అఖండ తరువాత మళ్ళీ మరోసారి ఫెరోషియస్ లుక్ లో బాలయ్యని అలా చూసాక ఏ అభిమాని మాత్రం ఆగగలడు.! బ్యాక్ గ్రౌండ్ లోని రేంజ్ రోవర్ కార్ సైతం బాలయ్య రేంజ్ ముందు ఆనట్లేదంటే ఆ లుక్ లో బాలయ్య సృష్టించే అరాచకాన్ని ఊహించండి. అందుకే షూటింగు మొదటి రోజునే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. ఆన్ లొకేషన్ తీసిన బాలయ్య స్టిల్లుకీ, వీడియో క్లిప్ కీ రెక్కలొచ్చేశాయి. మరి మేకర్స్ ఇకనుంచైనా సరైన కేర్ తీసుకోకుంటే సగం సినిమా తీసుకొచ్చి సామాజిక మాధ్యమాల్లోనే పెట్టెయ్యగలరు నందమూరి నటసింహానికి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్.!