గత కొన్నిరోజులుగా ఆంధ్ర రాష్ట్రాన్ని రగిలిస్తోన్న పీఆర్సీ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. బుధవారం నాడు విజయవాడలో లక్షలాది ఉద్యోగులు పాల్గొని నిర్వహించిన నిరసన కార్యక్రమం పట్ల తన స్పందన తెలిపేందుకు ఎప్పట్లానే పార్టీ ఆఫీసులో షూట్ చేయించిన ఓ వీడియో బైట్ వదిలారు జనసేనాని. యధావిధిగా తానూ ఓ ప్రభుత్వోద్యోగి కొడుకునే అనే అంశాన్ని ప్రస్తావిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, ప్రజలకు సహకరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా రోడ్ల పైకి రావడం తనని ఎంతో కలచివేసిందని చెప్పారు కళ్యాణ్. సోషల్ మీడియాలో ఎప్పుడో కామెడీ అయిపోయిన సీపీఎస్ రద్దు మ్యాటర్ ని ప్రస్తావించారు. పెరగాల్సిన జీతాలు తగ్గిపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంకా కామెడీ ఏంటంటే... ఈ అంశంపై ఆయన ఇంతకాలం స్పందించకపోవడానికి కారణం ఉద్యోగుల సంఘమేనట. ఆ సంఘాల నాయకులు మేమే పోరాడతాం, మేమే ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకుంటాం, ఇందులో ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం అవసరం లేదు అన్నారట. దాంతో జనసేన అధ్యక్షుడు మౌనంగా ఉన్నారట. మరి ఇపుడు అకస్మాత్తుగా ఆయన్ని మాట్లాడమని ఎవరు పిలిచారో చెప్పలేదు కానీ దాదాపు రెండు లక్షల మందికి పైగా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడం పవన్ పెదవి విప్పక తప్పని పరిస్థితి కల్పించిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
సరే ఏదైతేనేం చాలా గ్యాప్ తర్వాత జనసేనాని జనం ముందుకు వచ్చారు. మైక్ పట్టారు. మాట్లాడారు. వైసీపీ వైఫల్యాన్ని ఎత్తి చూపించారు. ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ఉండమని జనసైనికులకు పిలుపునిచ్చారు. వాళ్ళు అడిగినప్పుడు అండగా నిలబడదాంలే అని ముక్తాయింపునిచ్చారు. అంతే. ఫైన్ ట్యూన్ చేసుకుని వచ్చిన ఫైవ్ మినిట్స్ స్పీచ్ కి తెర పడిపోయింది.
అయితే పవన్ కళ్యాణ్ కి అసలు రాజకీయాలెందుకు అనే టాపిక్ కి తెర లేచింది కూడా ఇక్కడే.! అదెలాగంటే....
చాలా హుందాగా, బాధ్యతాయుతంగా మాట్లాడేసాను అనే భ్రమలో జనసేనాని ఉంటే జన సైనిక్స్ మాత్రం అబ్బా అన్నా లుక్ అద్దిరిపోయింది. నీకు ఈ రాజకీయాలు ఎందుకు... సరిగ్గా దృష్టి పెడితే సిల్వర్ స్క్రీన్ కింగ్ నువ్వు, ఆరడుగుల బులెట్ నువ్వు, కింగ్ అఫ్ టాలీవుడ్ నువ్వు అనే కామెంట్సే పెడుతున్నారు నేటికీ.
ఆఫ్ కోర్స్... మార్చ్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కానున్న హరి హర వీరమల్లు షెడ్యూల్ కోసం రెడీ అవుతోన్న పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ లెంగ్తీ హెయిర్ అండ్ షాబీ లుక్ లో చాలా ఎట్రాక్టివ్ గా ఉన్నారు.
అయితే మాత్రం పవనిజం పాటించే ఫాన్స్ కూడా ఇంకా ఆయన్ని హీరోగానే చూస్తే ఎలాగబ్బా..?
అభిమానులతోనే నాయకుడు అనిపించుకోలేని వ్యక్తి ఆంధ్రా ప్రజానీకాన్ని మొత్తం ఒప్పించేది ఎప్పుడబ్బా..!!