నిర్మాత రాహుల్ యాదవ్ చేతుల మీదుగా కళింగపట్నం జీవా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కళింగపట్నం జీవా. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మళ్లీ రావా చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్య మూవీ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఒక నిర్మాతగా సినిమా నిర్మాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది, తనే కథ రాసుకుని.. హీరోగా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం అనేది నిజంగా చాలా గొప్పవిషయం. ఈ సందర్భంగా రిత్విక్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చిత్రయూనిట్‌ని చూస్తుంటే.. ఈ సినిమా కోసం వారు ఎంత కష్టపడ్డారో అర్థం అవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. ఈ యంగ్ టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అని తెలిపారు.
లక్ష్య దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ.. ముందుగా చిత్రయూనిట్‌కి నా శుభాకాంక్షలు. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ కోవిడ్ టైమ్‌లో కూడా త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. థియేటర్లలో సినిమా విడుదల చేస్తామని చెబుతోన్న ఈ టీమ్ కాన్ఫిడెన్స్ నాకెంతో నచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
చిత్ర హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ... ముందుగా ఈ వేడుకకు వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాములుగా నేను డ్యాన్సర్‌ని. కానీ ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేదు. ఒక కమర్షియల్ చిత్రంతో కాకుండా వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాను. ఈ చిత్రానికి కథ, నిర్మాత, రీరికార్డింగ్ వర్క్ కూడా నేనే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు సహకరించిన ఇతర సాంకేతిక నిపుణులకి, నటీనటులకి ధన్యవాదాలు. అందరూ ఈ చిత్రం మాది అనుకుని వర్క్ చేశారు. ప్రస్తుతం షూటింగ్, ఎడిటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కోవిడ్ అనే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అప్పుడు ఒక్కటే అనుకున్నా.. ఒకవేళ చనిపోయినా ఒక ఫైటర్‌గా చనిపోవాలి తప్ప.. లూజర్‌గా చనిపోకూడదని. అందుకే పట్టుదలగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. హీరోకి ఇందులో ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ ధన్యవాదాలు.. అని తెలిపారు.
రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా, బిందు భార్గవి, ఉమా మహేశ్వరరావు, అంబటి శ్రీనివాస్, జబర్దస్త్ ఇమ్మానుయేల్.. తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శుభంకర్, సినిమాటోగ్రఫీ: బన్నీ అండ్ నానాజీ, ఎడిటింగ్: శ్రీరామ్, మోషన్ పోస్టర్: రవితేజ, ప్రొడక్షన్ మేనేజర్: రవి కుమార్, కో-డైరెక్టర్: ప్రశాంత్, పీఆర్వో: బి. వీరబాబు, కథ-నిర్మాత: రిత్విక్ చిల్లికేశల, దర్శకత్వం: పి. నానిబాబు.