అచ్చ తెలుగు ప్లాట్‌పార్మ్ ఆహా తమ అభిమాన ప్రేక్షకుల కోసం సేనాపతి అనే వెబ్ ఒరిజినల్ సినిమాను విడుదల చేయనుంది. ఈ క్రైమ్ డ్రామాతోనే వెటరన్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ ఓటీటీ డెబ్యూ చేస్తున్నారు. డిసెంబర్ 31న విడుదల కానుంది ఈ వెబ్ ఒరిజినల్ సినిమా. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన వరల్డ్ ఆఫ్ సేనాపతి స్నీక్‌పీక్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. సేనాపతి కథను ఒగ్గుకథ ద్వారా పౌరాణిక అంశాలతో పోల్చి చెప్పిన విధానం చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఎస్‌ఐ కృష్ణ (నరేష్ అగస్త్య), కృష్ణ మూర్తి (రాజేంద్రప్రసాద్) ఇద్దరూ కృష్ణభగవానుడి అవతారాలు. అయితే ఒకే లక్ష్యం కోసం కలియుగంలో రెండు వేర్వేరు దారులను వెతుక్కుతున్నట్టు ఒగ్గుకథలో చెప్పారు.
చిన్నం శ్రీను (మెయిన్ ఆర్టిస్ట్). కొండబోయిన మహేష్, కడకంచి పరశురాములు(కోరస్), జెబీ లక్ష్మణ్ గంగ (లిరిసిస్ట్) కలిసి సేనాపతిలో ఒగ్గుకథకు పనిచేశారు. తెలంగాణలో గొల్లకురుమ సామాజిక వర్గం ఈ ఒగ్గు కథను వివరించే సంస్కృతి ఉంది. దేవుళ్ల కథలను, రాచరిక వైభవాలను, యుద్ధాలను ప్రజలకు తమ ఒగ్గుకథల ద్వారా తెలిపేవారు. డమరుకం, డోలు, గజ్జెలతో ఈ కథలను చెప్పడం ఆనవాయితీ.
సేనాపతికి ఈ ఒగ్గుకళాకారులతో పనిచేయడం గురించి దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఆఖరికి మంచి నైపుణ్యం కలవారు దొరికారు. ఇలాంటి సదవకాశం వచ్చినందుకు వారు కూడా ఆనందంగా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఒగ్గు కథను రికార్డు చేసేటప్పుడు ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు. కానీ ఇవాళ వాళ్ల కథకు మంచి ఆదరణ దక్కుతోంది. సినిమా గొప్పతనం అది. టాలెంట్ ఎప్పటికైనా రాణిస్తుంది. సరైన సమయంలో దానికి తగిన గుర్తింపు వస్తుంది అని అన్నారు.
సేనాపతిలో జ్ఞానేశ్వర్ కాండ్రేగుల, హర్షవర్ధన్, కేశవ్ దీపక్, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే, 3 రోసెస్, ఒన్, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, ది బేకర్ అండ్ ద బ్యూటీ, క్రాక్, అల్లుడు గారు, లెవన్త్ హవర్, నాంది, సూపర్ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచ్చట వాహనములు నిలుపరాదు వంటి కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది ఆహా.