చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఈ రోజు బుధవారం మద్యాన్నం 12 గంటల సమయంలో కుప్ప కూలింది. ఆ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఇంకా ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందడం అందరిని కలిచివేసింది. తమిళనాడు సమీపంలో కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ హెలికాఫ్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులు సహా పదమూడు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సంఘటనాస్థలిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ చౌదురి పరిశీలించారు. మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అయిన కేబినెట్‌కు, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. రక్షణ రంగ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెలికాఫ్టర్ ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇంకా ఆర్మీ అధికారులు బిపిన్ రావత్ నివాసానికి వెళ్లి వచ్చారు.