శివశంకర్ మాష్టర్ మృతిపై ప్రముఖుల స్పందన
చిరంజీవి:
కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం.
చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు:
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమ కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది. శివశంకర్ తన డాన్స్ తో,నటనతో లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు. శివశంకర్ మాస్టర్ భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చి, 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేయడమే కాక దాదాపు 30 చిత్రాల్లో నటించారు. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.
పవన్ కళ్యాణ్:
ప్రముఖ సినీ నృత్య దర్శకులు శ్రీ శివశంకర్ మాస్టర్ కన్నుమూయడం బాధాకరం. కోవిడ్ మూలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కోలుకుంటారు అని భావించాను. శ్రీ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ సినిమా మగధీరలో శ్రీ శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా జాతీయస్థాయి పురస్కారాన్ని పొందింది. వందల చిత్రాల్లోని పాటలకు తన కళ ద్వారా నృత్యరీతులు అందించిన శ్రీ శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
నందమూరి బాలకృష్ణ:
ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్(72) హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ‘శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.