ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని సినీ నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మా ఎన్నికలపై స్పందించారు. మా ఎన్నికలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయని అన్నారు. అంతేకాకుండా తాను ఎవరికి ఓటు వేయనున్నారనే విషయంపై స్పందించారు. ఈసారి మా ఎన్నికలు ఎంతో హోరాహోరీగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి నేను ఏం మాట్లాడాలనుకోవడం లేదు. రెండు ప్యానెల్స్ మేనిఫెస్టోలు చూశాను. అభివృద్ధి చేసే ప్యానెల్‌కే నా ఓటు వేస్తాను అని రోజా తెలిపారు.
అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు ప్రకాశ్‌రాజ్.. ఇటు మంచు విష్ణు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.