Advertisementt

ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది -సురేష్ కొండేటి

Wed 06th Oct 2021 11:16 AM
suresh kondeti,suresh kondeti interview,santhosham suresh,kondeti suresh  ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది -సురేష్ కొండేటి
Suresh Kondeti interview ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది -సురేష్ కొండేటి
Advertisement
సినిమా సిగలో మూడు దశాబ్దాల ధగ ధగలు.. -ఇదీ సురేష్ కొండేటి జీవన ప్రస్థానం
పాలకొల్లులో పుట్టి ఫిలిం నగర్ లో కాలుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సురేష్ కొండేటి. సంతోషం సురేష్ అని పిలుచుకునే సురేష్ కొండేటి జీవిత ప్రస్థానాన్ని అవలోకిస్తే ఎన్నో మజిలీలు కనిపిస్తాయి. స్కూల్ డేస్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన సురేష్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మారి హైదరాబాద్ లో అడుగుపెట్టి తన సంతోషం తో సినిమా పరిశ్రమకు సగం బలాన్ని అందిస్తున్న సురేష్ కొండేటి మూడు దశాబ్దాల అనుభవాన్నిమూటగట్టుకున్నారు. జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న సురేష్ కొండేటి ఈ అక్టోబరు 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా సినీజోష్ ప్రత్యేక కథనం.
సినిమా వారి పుట్టిల్లు.. పాలకొల్లు అన్న పేరు వినగానే సినిమా వారి పుట్టిల్లు అంటుంటారు. ఎందరో సినీ ప్రముఖులు ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమలో కాలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వారే. సురేష్ కొండేటి స్వస్థలం కూడా పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లే. సినిమాల మీద ఆసక్తితో నటుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి జర్నలిజం వైపు జీవితం మళ్లింది. నటుడిగా కంటే జర్నలిస్టుగా దూసుకెళ్లారు. రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. కృష్ణాపత్రిక, వార్త దిన ప్రతికల్లో సినిమా జర్నలిస్ట్‌గా విశేష అనుభవాన్ని సంపాదించుకున్న సురేష్ కొండేటి ఆ తర్వాత సొంతంగా సంతోషం సినిమా వార ప్రతికను ప్రారంభించారు. ఈ వీక్లీ మ్యాగజైన్‌ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. తన పత్రిక పేరుతోనే సంతోషం ఫిల్మ్ అవార్డులను అందించడం మొదలుపెట్టారు. ఇవాళ సౌత్‌లోనే ఫిల్మ్ ఫేర్ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్నది సంతోషం అవార్డ్స్ కే అంటే అతిశయోక్తి కాదు. చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ తనను సొంత మనిషిగా భావించి అక్కున చేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని సురేష్ కొండేటి చెబుతుంటారు.
అటు పీఆర్వోగా.. ఇటు నిర్మాతగా.. జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే మరో వైపు సినిమాలకు పీఆర్వోగానూ చేస్తున్నారు సురేష్ కొండేటి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సురేష్ కొండేటి పీఆర్వోగా వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలుసు. పీఆర్వోగా దాదాపు 600 చిత్రాలు చేశారు. ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు నిర్మించడం కూడా మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీయార్, గజాల జంటగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్1 చిత్రం సురేష్ కొండేటి కెరీర్‌కు పంపిణీదారుడిగా పునాది వేసింది. మహేశ్వరి ఫిల్మ్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో అప్పటివరకు ఎన్నోసినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి, సొంతంగా ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి తన తొలి సినిమాగా స్టూడెంట్ నెంబర్1 చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు రాగా తొలి సినిమా డిస్ట్రిబ్యూషన్‌తో విజయం సొంతం చేసుకున్న సంస్థగా ఎస్‌కే పిక్చర్స్‌ గుర్తింపు తెచ్చుకుంది. 75 చిత్రాలను పంపిణీచేసిన అనుభవం సురేష్ కొండేటిది. ఆ అనుభవంతోనే ‘ప్రేమిస్తే’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జర్నీ, పిజ్జా ఇలా  దాదాపు పదిహేను చిత్రలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు.  స్టార్ కమెడియన్ షకలక శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంతమైన చిత్రం శంభో శంకర నిర్మాతల్లో సురేష్ కొండేటి ఒకరు. అలాగే మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్‌ ను తెలుగులో జనతా హోటల్‌ పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేష్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. నటుడిగానూ పయనం.. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేసిన సురేష్ కొండేటి ఇటీవల కీలక పాత్రలు సెకండ్ లీడ్ లో చేస్తున్నారు. అందుకు ఉదాహరణ దేవినేని మూవీలోని వంగవీటి రంగా పాత్రే. ఈ సినిమాలో సురేష్ కొండేటిది ప్రధాన పాత్ర. అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అల్లు అరవింద్ గారి వల్లే.. చిత్రసీమలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పుట్టిన రోజు (అక్టోబర్ 6వ తేదీ)ని వేడుకగా జరుపుకోవడం అలవాటు లేదు. అయితే ఓసారి మగధీర ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ గారికి ఆ వేళ నా బర్త్ డే అనే విషయం తెలిసి.. వెంటనే కేక్ తెప్పించి బర్త్ డే జరిపించారు. మా పాలకొల్లు వాసి, నాకు చిత్ర పరిశ్రమలో చేదోడు వాదోడుగా ఉంటే అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో అప్పటి నుండి బర్త్ డే జరుపుకుంటున్నాను అని సురేష్ కొండేటి గతంలో వెల్లడించారు.
అప్‌డేట్ పర్సన్.. మల్టీ ట్యాలెంటెడ్.. చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ తలలో నాలుకగా వ్యవహరించే సురేష్ కొండేటి కాలంతో పరుగులెత్తే వ్యక్తి.. సంతోషం పత్రికను క్రమం తప్పకుండా ప్రచురించడంతో పాటు చిత్రసీమలోని అనేక విభాగాలలో అన్నీ తానై వ్యహరిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యుడిగానూ, ఫిల్మ్ ఛాంబర్ కల్చరల్ కమిటీ ఛైర్మన్‌గా, ఎఫ్.ఎన్.సి.సి. పాలకమండలి సభ్యునిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగానూ విశేష సేవలు అందించారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, నిర్మాతగా, నటుడిగా, పలు అసోసియేషన్స్‌లో సభ్యుడిగా వ్యవహరిస్తూ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు పొందారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఆరు సార్లు ఈసీ మెంబర్‌గా పని చేసిన సురేష్ కొండేటి.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్షతన ప్రారంభమైన సినిమా బిడ్డలం ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. ఇవాళ చిత్రసీమలో అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే ఆయన ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంటారు. ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో చిత్ర పరిశ్రమ సురేష్‌లోని ఆ అప్‌డేటెడ్ మనిషిని గుర్తించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రింటింగ్ సదుపాయం కూడా లేని టైమ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి వార్తలను సోషల్ మీడియా ద్వారా అందరికీ అందించారు. నేటికీ ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారు.
సంతోషం సురేష్ ఫిల్మ్ న్యూస్.. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో అన్నీ స్తంభించి పోయాయి. ప్రింటింగ్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఏదీ లేకపోవడంతో పాఠకులకు వార్తలు చేరవేయడం ఇబ్బందిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో సురేష్ కొండేటి తన బుర్రకు పదును పెట్టి కొత్తగా ఆలోచించారు. ఏ రోజు వార్తలు ఆ రోజు అందించేలా సంతోషం సురేష్ టాప్ ఫిల్మ్ న్యూస్‌ను తీసుకొచ్చారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు పని చేస్తూ సంతోషం సురేష్ టాప్ ఫిల్మ్ న్యూస్‌ను నిర్విరామంగా అందిస్తున్నారు. అది ఎంతగానో సక్సెస్ అయింది. ప్రస్తుతం 558 ఎపిసోడ్‌తో దూసుకుపోతోంది. ఇండస్ట్రీలోని ఎంతోమంది సంతోషం సురేష్ ఫిల్మ్ న్యూస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారనడం అతిశయోక్తి కాదు. ఒక మ్యాగజైన్ అధినేత నుంచి నిరంతరాయంగా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 600 ఎపిసోడ్స్‌కు దగ్గరవుతుండడం ఒక రికార్డ్ అని చెప్పొచ్చు.
20వ సంతోషం అవార్డ్స్‌కు సమాయత్తం.. దక్షిణాది సినీ పరిశ్రమలో సంతోషం అవార్డ్స్ అంటే ఎంతో గౌరవం ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఆగిన ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సురేష్ కొండేటి సమాయత్తం అవుతున్నారు. ఈ సారి సుమన్ టీవీతో కలిసి సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లనూ సురేష్ కొండేటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంతోషం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సంతోషం అవార్డ్స్ కార్యక్రమం నవంబర్ 14న హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరగనుంది.
3 దశాబ్దాల ప్రస్థానం.. ఎంతోమందికి ఆదర్శం.. సురేష్ కొండేటి 1992లో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. వచ్చే ఏడాదికి ఇండస్ట్రీ మనిషిగా 30 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ఈ 3 దశాబ్దాల కెరీర్‌లో సురేష్ కొండేటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనను చూసే కొంతమంది పీఆర్వోలు కూడా అయ్యారు. సురేష్ కొండేటి దగ్గర పని చేసినవాళ్లలో ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇదీ మూడు దశాబ్దాల సురేష్ కొండేటి జీవన పయనం.. మరెందరికో స్ఫూర్తిదాయకం.
అన్ని రంగాల్లో సక్సె స్ సాదించాలన్నదే నా ప్రయత్నం: నిర్మాత, నటుడు సురేష్ కొండేటి. మన జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం ఉండాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు సురేష్ కొండేటి. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటాడన్న పేరు ఉంది. సాధారణ స్థాయి నుండి ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మ్యాగజిన్ అధినేత, నటుడు ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఈ మద్యే దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో నటించి మెప్పించిన సురేష్ కొండేది జన్మదిన అక్టోబర్ 6, ఈ సందర్బంగా అయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. మగధీర సినిమా సక్సెస్ మీట్ లో ఇక్కడే ఫిలిం కల్చరల్ సెంటర్ లో మొదటి సారి ఆ వేదికపై నా బర్త్ డే వేడుకలను నిర్మాత అల్లు అరవింద్ గారు చేసారు. అప్పుడే నేను కూడా సెలెబ్రిటీ అయ్యానని అనుకున్నాను. ఆ ఉత్సహంతో మరింత ముందుకు సాగాను. నిజానికి నేను పరిశ్రమకు వచ్చింది నటుడిగా ఎదగాలని, 1992 లో నేను ఇండస్ట్రీ కి వచ్చాను. అప్పుడు చాలా సన్నగా ఉండేవాణ్ణి, కానీ నటుడికి కావలసిన క్వాలిటీస్ లేవని ఆ తరువాత తెలుసుకున్నాను. చాలా ఆఫీసుల్లో అవకాశాల కోసం అడిగాను. ఆ తరువాత కృష్ణా పత్రికలో తెలిసిన బంధువులు ఉంటె వారి సహకారంతో అందులో చేరాను. నా ఉత్సహం చుసిన ఆ పత్రిక ఓనర్ గారు కృష్ణ చిత్ర అనే కాలం స్టార్ట్ చేసారు. అలా సినిమాలకు సంబందించిన న్యూస్ ఇచ్చేవాడిని. అందులోనే సూపర్ స్టార్ కృష్ణ గారి 300 వ సినిమా తెలుగు వీర లేవరా సమయంలో కృష్ణ చిత్ర అనే ఓ స్పెషల్ మగజైన్ ముద్రించాం. నేను స్కూల్ డేస్ లో క్రిష్ గారి అభిమానిని, ఆ తరువాత టెన్త్ లో చిరంజీవి గారి అభిమానిగా మారిపోయా. కృష్ణగారి బుక్ కోసం సింగపూర్ లో ఉన్న చిరంజీవి గారితో ఫోన్ లో మాట్లాడి ఆయనతో కృష్ణగారి కి  సంబందించిన అభిప్రాయం అడిగితె అయన ఫ్యాక్స్ లో పంపించారు . ఆ లెటర్ చూసిన వాళ్ళు ఆ పత్రికలో నన్నో సెలేబ్రిటిగా ట్రీట్ చేసారు. పరిశ్రమలో నాకు చాలా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎవరి సురేష్ అనే రేంజ్ లో ఎదిగాను. ఆ తరువాత వార్త పత్రికలో చేరాను. అక్కడ చేరాకా పరిశ్రమతో ఎక్కువగా అనుభందం పెరిగింది. అప్పటినుండి నన్ను వార్త సురేష్ అనే గుర్తు పెట్టుకున్నారు,. అలా చిరంజీవి గారితో పరిచయం, నాగార్జున గారితో పరిచయం ఇలా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాను. అలా స్టార్ హీరోలందరితో మంచి పరిచయం పెరిగింది. ఆ తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ అని డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టాను. వెస్ట్ గోదావరి జిల్లాలో  మొదలెట్టాను. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, ఆ తరువాత ఎస్ కె పిక్చర్ పేరుతొ డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేశా, స్టూడెంట్ నంబర్ 1 తో మొదలెట్టి చాలా సినిమాలు చేశాను. నేనుచేసిన సినిమాలని నాకు లాభాలను తెచ్చిపెట్టాయి.
ఆ తరువాత నాగార్జున గారితో కూడా ఎక్కువ పరిచయం ఉండేది. ఆ సమయంలో నాగార్జున గారు సంతోషం సినిమా చేస్తున్నారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ హక్కులు వెస్ట్ గోదావరికి నేను తీసుకున్నాను. ఆ సినిమా విషయంలో నాకు చాలా నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతో ఎక్కువ రేట్ పెట్టి కొన్నాను. ఆ సినిమా హిట్ అయితే ఈ పేరుతొ మగజినె పెడతాను అని చెప్పాను. మ్యాగజిన్ ని 2002 లో సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసి గత ఇరవై ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాను. మ్యాగజిన్ స్టార్ట్ చేసిన తరువాత ఒకరోజు నాగార్జున గారు  అడిగారు. సురేష్ లో మంచి టాలెంట్ ఉంది, తెలుగులో అవార్డ్స్ లేవు.. కాబట్టి సంతోషం పేరుతొ అవార్డు పెడితే బాగుంటుంది అని చెప్పడంతో నాగార్జున కోరిన మేరకు అవార్డు వేడుక గత ఇరవై ఏళ్లుగా చేస్తున్నాను. కోవిద్ సమయంలో రెండేళ్లు మాత్రం జరపలేదు.. కానీ ఈ నవంబర్ 14న చాలా గ్రాండ్ గా అవార్డు వేడుకలు జరుపుతున్నాను. ఈ కరోనా సమయంలో పరిశ్రమ ఓ గొప్ప గాయకుడిని కోల్పోయింది. ఈ సారి జరిపే వేడుకలో ఎస్పీ బాలు గారి పేరుతొ ఐదు భాషల్లో మేల్, ఫిమేల్ సింగర్స్ పదిమందికి అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. 2019-2020 రెండు సంవత్సరాల అవార్డులు ఒకే వేదికపై సాయంత్రం 4 గంటనుండి రాత్రి 1 గంట వరకు నిర్విరామంగా ఈ అవార్డు వేడుక జరపబోతున్నాము. ఈ కార్యక్రమం మొత్తం ఒక ప్రముఖ ఎంటర్ టైనేమేంట్ ఛానల్, ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారం అవుతుంది. అలాగే ఈసారి  ఈవెంట్ ను సుమన్ టివి సుమన్ గారితో కలిసి చేయబోతున్నాం.
అవార్డు వేడుకలో మెగాస్టార్ గారు సురేష్ నిర్మాతగా పేరు ఎప్పుడు వేసుకుంటావ్ అని అడగడంతో వెంటనే ప్రేమిస్తే సినిమాకు నిర్మాతగా చేశాను. ఆ సినిమా ఏ రేంజ్ సంచలనమ్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. ఆ తరువాత జర్నీ, ఇలా చాలా సినిమాలు చేశాను. అలా నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా ఉన్నపుడు మళ్ళీ ఒకరోజు చిరంజీవి గారు ఏమయ్యా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ లో ఉన్నావు, నా సినిమా చేయవా అని అడిగితె వెంటనే వెస్ట్ గోదావరికి ఆ ఠాగూర్ సినిమాను తీసుకున్నాను. అది 17 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది.. ఇప్పటికి ఆ రికార్డ్ ఎవరు దాటలేదు. నేను మీడియా వ్యక్తిగా, అటు సినిమా వ్యక్తిగా రెండు వైపులా ఉంటున్నాను. ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో ఓ పాత్ర చేసాను. అలాగే నేను నిర్మాతగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాను, దాంతో పాటు ఎర్రచీర లో కూడా చేశాను. అలాగే నటుడిగా 1995 లో రాంబంటు సినిమాలో మొదటి సారి తెరపై నటుడిగా కనిపించాను. అలా చాల సినిమాలు చేశాను. అయితే దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ హీరోగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సహంతో హీరోగా కూడా చేయాలన్న కోరిక ఉంది. నాకు దాసరి గారు స్ఫూర్తి. ఆయనలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయితా, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ఎదగాలన్నది నా కోరిక.
నేను వందరూపాయలు తీసుకుని హైద్రాబాద్ వచ్చాను. నేను నా సొంతంగా బతకాలన్నది నా ఆలోచన, మా నాన్న బ్యాంకు ఎప్లాయ్. మధ్యతరగతి ఫ్యామిలీ మాది. కానీ నేను నా కాళ్లపై నిలబడాలన్న సంకల్పంతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది .. కాబట్టి ఇండస్ట్రీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. అందుకే మా అసోసియేషన్ లో ఈసీ మెంబర్ గా ఆరేళ్లుగా ఉనాన్ను. నాకు పనిచేయడం ఇష్టం. ఏదైనా సరే పరిశ్రమ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మా అసోసియేషన్ లో మళ్ళీ ఈ సారి మెంబర్ గానే పోటీ చేస్తున్నాను. గత మా ఎన్నికల్లో నాకు 264 ఓట్లు వచ్చాయి.. ప్రసిడెంట్ గా పోటీ చేసిన నరేష్ కి 268 ఓట్లు వచ్చాయి. అంటే అందరు నన్ను ఈసీ మెంబర్ గా ఎన్నుకున్నారని ఈ సందర్బంగా తెలియచేస్తున్నాను. 

Suresh Kondeti interview:

Film industry has given me so much -Suresh Kondeti

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement