చతుర్విధ సేవలతో చరితార్థం అవుతున్న 'చిరంజీవి'తం
జిలుగు వెలుగుల సినీరంగంలో అతను ఒక సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ యాక్టర్. తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో అతను పోషించిన వందలాది పాత్రలలోని ఆవేశం, ఆవేదన, బాధ, దారిద్ర్యం, దైన్యం అతని జీవితంలోకి కూడా ప్రవేశించాయేమో.. అతని అవసాన
దశ అత్యంత దారుణంగా మారిపోయింది. క్షీణించిన ఆరోగ్యం అతని ఆయుషును ఆఖరి ఘడియలకు చేర్చింది. బతుకు బండి నడవటమే కష్టమైన అతనికి ఖరీదైన వైద్యం అందని ద్రాక్ష పండే అయింది. ఆపరేషన్ కు 75 వేలు ఖర్చవుతుంది అన్నారట.. మందులకు ఉపయోగపడతాయిలే అంటూ మరో 25 వేలు వేసి లక్ష రూపాయలను ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా పంపించింది..
ఓ అభయ హస్తం.
అంతే.. అతని ఆయుష్షు పెరిగింది..
బతుకు మీద.. ఆశ చిగురించింది..
కృతజ్ఞత నిండిన కళ్ళతో ఆ ఆపన్న హస్తానికి అంజలి ఘటించుకుందాం అంటే అందాల్సిన సహాయం అందింది.. జరగాల్సిన మేలు జరిగింది కదా.. అది చాలు అంటూ చిరునవ్వుతో పక్కకి తప్పుకుంది..
ఆ అజ్ఞాత అభయ హస్తం..
చిత్ర పరిశ్రమలో ఆమె కొద్దిపాటి గుర్తింపు కలిగిన నటి. ఆమె పోషించిన చిరు పాత్రలు ఆమెనూ, ఆమెకు వచ్చిన జబ్బును పోషించలేకపోయాయి. ముదురుతున్న అనారోగ్యానికి ముంచుకొస్తున్న మృత్యువుకు మధ్య నిస్సహాయంగా నిలబడ్డ ఆమె ఇంటికి రెండు లక్షల రూపాయలు రెండో కంటికి తెలియకుండా నడిచి వెళ్లాయి. ఇది కూడా ఆ అజ్ఞాత ఆపన్నహస్తం పనే..
అతను సినిమాల్లో ఒక పేరు మోసిన హాస్యనటుడు. ఒక దశలో అతను లేని తెలుగు సినిమా లేదు అన్నంత బిజీ నటుడు అతను. కేవలం నటుడే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత, జర్నలిస్ట్, ప్రయోక్త.. బహుముఖ ప్రజ్ఞల ఆ హాస్య ప్రముఖున్ని అపహాస్యం చేసింది విధి.
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే ఖరీదైన శస్త్రచికిత్స జరిగితే తప్ప అతను బతికే ఛాన్స్ లేదన్నారు డాక్టర్లు. ఆ విషయం విన్న వెంటనే గ్లోబల్ హాస్పటల్ కు 5 లక్షల రూపాయలు పరిగెత్తుకెళ్ళాయి. పంపించిన ఆ ఆపన్న హస్తం తన వామ హస్తంతో చెప్పింది.. ఎవరికీ చెప్పొద్దు అని.
ఆమె దాదాపు వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఒకప్పటి అగ్ర కథానాయిక. భర్త అనారోగ్యం పాలు కావడంతో వైభవోపేతమైన జీవితాన్ని చూసిన ఆమె పరిస్థితి అనూహ్యంగా తారుమారైంది. భర్త వైద్యానికి ఆస్తులు హారతి కర్పూరం అయ్యాయి. ఆ స్థితిలో సహాయం కోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్న ఆమెకు నేనున్నానంటూ 3 లక్షల రూపాయల పంపించింది..
ఆ అభయ హస్తం.
అప్పటికి ఆమె భర్త ప్రాణాలు నిలబడ్డాయి .
ఆమె కళ్ళు కృతజ్ఞతతో వర్షించాయి .
ఆ ఆపన్న హస్తం తృప్తిగా నవ్వుకుంది.
అతను ఒక శిఖరాగ్ర దర్శకుడి దగ్గర సహ దర్శకుడిగా పనిచేసిన సీనియర్ కో-డైరెక్టర్. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. దానితో అతని పరిస్థితి తలకిందులైంది. ఫీజు కట్టని కారణంగా అతని కుమార్తెను పరీక్షలు రాయనివ్వలేదు కాలేజీ యాజమాన్యం. మేనేజర్ ద్వారా ఆ ఆపన్నహస్తం దృష్టికి వెళ్ళింది ఈ విషయం.
అంతే.. ఆగమేఘాల మీద రెండు లక్షల యాభై ఐదు వేలు కాలేజీ యాజమాన్యం అకౌంట్లో జమ అయ్యాయి. ఆ అమ్మాయి ఆనందంగా పరీక్ష రాసింది.. ఆ ఆపన్న హస్తం హ్యుమానిటీ లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.. ఇవి ఆ ఆపన్న హస్తం గుట్టుగా చేసిన వేలాది గుప్త దానాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. తను చేసిన గుప్తదానాల గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని ఆ ఆపన్నహస్తం నిత్యం ఆందోళన చెందుతుంటుంది.
ఆ గుప్తదానాలు స్వీకరించిన వారు ఆత్మన్యూనతకు గురి కాకూడదు.. అన్నదే ఆ ఆందోళనకు కారణం. అయితే కాలం మారిపోయింది. పాత రోజుల్లో అయితే పొందిన సహాయాన్ని చెప్పుకుని, పది మందితో పంచుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కృతజ్ఞత నిండిన కళ్ళతో మనసారా చెప్పుకోవటానికి సోషల్ మీడియా అనే వేదిక దొరకటంతో ఆ ఆపన్నహస్తం దశాబ్దాల నుండి గుట్టుగా చేస్తున్న సహాయ సేవా కార్యక్రమాల గుట్టు రట్టు అవుతుంది.
ఇంతకీ ఎవరిది ఆ ఆపన్నహస్తం..? ఎవరా గుప్త దాత..? అన్నదేగా మీ సందేహం..?
సేవ అయినా దానమైనా ముందుగా నీ ఇంటి నుండి ప్రారంభించు అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా గౌరవిస్తున్న ఆ అజ్ఞాత గుప్త దాత.. చిరంజీవి అని ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది..
ఎస్.. ఇట్స్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి.
దాతృత్వం వల్ల సంపద కరగదు.. తరగదు.. అది ఆత్మ సంతృప్తి రూపంలో పదింతలై తనను జీవితాంతమూ, జీవితానంతరం కూడా 'చిరంజీవి' గా నిలుపుతుందన్నది చిరంజీవి ప్రగాఢ విశ్వాసం. అందుకే దశాబ్దాలుగా అలుపెరుగని సేవా ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు చిరంజీవి. కోట్లు సంపాదిస్తున్న అందరూ కాకపోయినా కొందరు తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అయితే చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల విస్తృతికి కొన్ని నిర్ధిష్టమైన లక్ష్యాలు, లక్షణాలు ఉన్నాయి.
జలాశయం నుండి జలనిధి ఎలా పాయలుగా విడిపోయి పరుగులు పెడుతుందో చిరంజీవి అనే నాలుగు అక్షరాల సేవానిధి నాలుగు విధాలుగా జన జీవితంలోకి ప్రవహిస్తోంది. హీరోగా కెరీర్ ఒక ఉధృత స్థాయికి చేరుకున్న తొలి రోజుల్లోనే చిరంజీవి తనలోని మానవతా కోణాన్ని ఆవిష్కరించుకోవడం ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న సాటి నటీనటులను పరామర్శించి ఆదుకోవడంతో ప్రారంభమైన చిరంజీవి దాతృత్వ నైజం క్రమంగా ప్రణాళికాబద్ధమైన సేవా ఉద్యమంగా మారింది.. పరిణామం చెందింది.
ఈ నేపథ్యంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి ద్వారా లభిస్తున్న సేవా లబ్ధిని నాలుగు భాగాలుగా, నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో మొదటిది నటీనటులను, సాంకేతిక నిపుణులను, అభిమానులను ఇతరత్రా అవసరార్ధులను ఆదుకుంటూ చేసే గుప్త దాన సేవ. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్న సిద్ధాంతాన్ని చిరంజీవి చాలా బలంగా నమ్ముతారు. ఇందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి లబ్ధి పొందినవారు ఎలాంటి ఆత్మన్యూనతకు గురి కాకూడదు అన్నది ఒక కారణం అయితే అపాత్రదానాల అపాయం నుండి తప్పించుకోవటం రెండవ కారణం. అందుకే ఇచ్చిన చెయ్యి తీసుకున్న చెయ్యి ఆ విషయాన్ని అక్కడే అప్పుడే మర్చిపోవాలి అన్నది చిరంజీవి అభిప్రాయం. అయితే సహాయం పొందినవారు కృతజ్ఞతా పూర్వకంగా బయట చెప్పుకోవటం వల్ల చిరంజీవి చేస్తున్న వేలాది గుప్తదానాలలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి.
ఇక వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, నేటి కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదరించిన ప్రజలను ఆదుకోవాలి అనే మానవతా దృక్పథాన్ని కెరీర్ తొలి రోజుల్లో నే అలవరచుకున్నారు చిరంజీవి. ఒకసారి ఒంగోలు జిల్లాలో 14 మంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తతో చలించిపోయిన చిరంజీవి వారి కుటుంబ సభ్యులను మద్రాసు పిలిపించి యముడికి మొగుడు శత దినోత్సవ వేడుకల్లో వారికి సకల మర్యాదలు చేసి ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలా వ్యక్తిగతంగా ఇచ్చే విరాళాల బరువును లక్షల నుండి కోట్లకు పెంచుకుంటూ పోయారు చిరంజీవి. అలా వ్యక్తిగతంగా భారీ స్థాయిలో స్పందించడమే కాకుండా ఆయా సందర్భాలలో నిర్వహించే ఫండ్ రైజింగ్ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుంటారు చిరంజీవి.
ఇటీవల ఆయన చొరవతో ఊపిరి పోసుకున్న కరోనా క్రైసిస్ ఛారిటీ చిత్ర పరిశ్రమలోని వేలాది కార్మికులను ఎలా ఆదుకుందో అందరికీ తెలుసు. ఇక చిరంజీవి సేవా ఉద్యమంలో అతి ప్రధానమైన అంశం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అండ్ ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన, నిర్వహణ. విపత్కర పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడంతో బాధ్యత తీరింది అన్నట్లు కాకుండా ఒక శాశ్వత సేవా ఉద్యమాన్ని నిర్మించాలన్న చిరంజీవి ఉక్కు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి బ్లడ్, ఐ అండ్ ఆక్సిజన్ బ్యాంకుల ప్రతిష్టాపన. నిజానికి అలాంటి వ్యవస్థలను నిరంతరాయంగా నిర్వహించాలంటే చాలా మంది విరాళాల మీద ఆధారపడతారు .కానీ చిరంజీవి మాత్రం ప్రభుత్వాల నుండి కానీ వ్యక్తుల నుండి కానీ ఎలాంటి ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా, ట్రస్టుల పేరిట యాచించకుందా కోట్లాది రూపాయల స్వార్జిత ధనాన్ని నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహణకే నెలకు 15 లక్షలు చొప్పున సాలీనా కోటి 80 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు చిరంజీవి. రక్త సేకరణ లోను, రక్తాన్ని నిల్వ చేయడంలోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పాటించే ప్రమాణాలు అత్యంత ఆధునికంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉండటం విశేషం. ఇక ఇటీవల ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంక్ ల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు చిరంజీవి. తన అభిమానుల సహకారంతో చిరంజీవి చేపట్టిన ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన ఆయన సేవా ఉద్యమంలో ఒక గొప్ప మలుపు. ఆక్సిజన్ బ్యాంకులు సామాన్య ప్రజలకే కాకుండా బ్యూరోక్రాట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లకు కూడా అందుబాటులోకి తేవడం విశేషం. మొత్తం మీద బ్లడ్, ఐ అండ్ ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణ చిరంజీవి స్వచ్ఛందంగా శిరోధార్యం చేసుకున్న ఒక నిరంతర బాధ్యత.
ఇలా చిరంజీవి చేస్తున్న గుప్తదానాలు, ఇస్తున్న భూరి విరాళాలు, నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకు వంటి సేవలు డబ్బుతో ముడిపడినవి అయితే చిరంజీవి సేవల్లో ప్రేమతో ముడిపడిన మరొక ముఖ్య కోణం ఉంది. అదే అందరిలో స్ఫూర్తి నింపటం. నిజానికి చిత్రపరిశ్రమలో చిరంజీవి నెలకొల్పిన కొన్ని సత్ సంప్రదాయాలు అందని వాడైన చిరంజీవిని అందరివాడిని చేశాయి. గతంలో శత దినోత్సవాలు, విజయోత్సవాలు వంటివి జరిగితే ఆ వేడుకలు పూర్తవగానే ఎవరి షీల్డ్ వాళ్లు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోయేవారు. కానీ చిరంజీవి చొరవతో చిత్ర పరిశ్రమలో అందరినీ కలుపుకుపోయే పార్టీ కల్చర్ ప్రారంభమైంది. వృత్తిపరమైన పోటీలను, ఇగోలను పక్కన పెట్టి అందరూ ఒకటిగా మమేకమయ్యే సమైక్య సాధనకు వేదికలు సిద్ధం చేసిన క్రెడిట్ చిరంజీవిదే. పరిశ్రమలోని నటీనటులు ఎవరైనా విజయం సాధిస్తే చిరంజీవి వారిని అభినందించే తీరు, ప్రోత్సహించే విధానం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి.
వృత్తిపరంగా నైనా, వ్యక్తిగతంగా నైనా నిరాశా నిస్పృహలకు గురైన వారిని తన పలకరింపుతో, పరామర్శతో స్వాంతన చేకూర్చే చిరంజీవి చుట్టూ కుర్ర హీరోలంతా చేరిపోతారు. 'బాగా డిప్రెషన్ గా ఉందిరా.. ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్లి రీఛార్జి అవ్వాలి' అంటూ చిరంజీవిని ఒక రీ ఫీలింగ్ స్టేషన్ లాగా భావించడం ఆయన నుండి లభించే ఆదరాభిమానాలకు నిదర్శనం.
ఇక అభిమానులను ఆయన తీర్చిదిద్దిన విధానం అందరికీ ఆదర్శప్రాయం. ఒకప్పుడు అభిమానులు అంటే బాధ్యత లేకుండా ఆవారాగా తిరిగె కుర్రాళ్లు అనే అపప్రద ఉండేది. అలాంటి తరుణంలో అభిమానులను సేవా ఉద్యమ కార్యకర్తలుగా మలిచి సమాజంలో వారికి ఒక గౌరవాన్ని, విలువను ఆపాదించి పెట్టిన ఘనత చిరంజీవికి దక్కుతుంది.
ఇలా డబ్బుతో ముడిపడిన మూడు రకాల సేవలు, ప్రేమతో ముడిపడిన ప్రోత్సాహ సేవతో నాలుగు విధాలుగా సాగుతుంది చిరంజీవి సాగిస్తున్న 'చతుర్విధ సేవా ఉద్యమం'.
వెండితెర మీద తాను పోషించిన కొన్ని ఆదర్శప్రాయమైన పాత్రల ఔన్నత్య ,ఔదార్యాలను తన వ్యక్తిత్వంలో నింపుకొని చిరంజీవి సాగిస్తున్న ఈ సేవా ఉద్యమం చిరకాలం కొనసాగాలని ఆశిద్దాం..
మన మెగాస్టార్ కు సినీజోష్ నుండి జన్మదిన శుభాభినందనలు చెపుదాం. -A ప్రభు (సీనియర్ జర్నిలిస్ట్)