Advertisementt

ఘంట‌సాల‌ అభిమాని రామారావు ఇక లేరు

Sun 11th Jul 2021 01:57 PM
anda rama rao,anda rama rao passed away,ramarao anda,anda ramarao  ఘంట‌సాల‌ అభిమాని రామారావు ఇక లేరు
Anda Rama Rao passed away ఘంట‌సాల‌ అభిమాని రామారావు ఇక లేరు
Advertisement
Ads by CJ

అంద‌రివాడు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అండా రామారావు ఇక లేరు అన్న వార్త ఆయ‌న ఆత్మీయుల‌ను, స‌న్నిహితుల‌ను, స్నేహితుల‌ను దుఃఖ‌సాగ‌రంలో ముంచి వేసింది. అంద‌రితోనూ ఎంతో స‌ఖ్యంగాఉంటూ అభిమానం ప్ర‌ద‌ర్శించేవారు అండా రామారావు. అందుకే ఆయ‌న అంద‌రికీ అభిమాన పాత్రుడు అయ్యారు. చ‌దువుకొనే రోజుల నుంచీ సినిమాలంటే రామారావుకు ఎంతో ఇష్టం. య‌న్టీఆర్, సావిత్రి ఆయ‌న అభిమాన న‌టులు. ఇక గాన‌గంధ‌ర్వుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు అంటే ప్రాణం. పింగ‌ళి, స‌ముద్రాల‌, మ‌ల్లాది, శ్రీ‌శ్రీ‌, ఆరుద్ర‌, ఆత్రేయ‌, దేవుల‌ప‌ల్లి, సినారె, వేటూరి, సీతారామ‌శాస్త్రి సాహిత్యాల‌న్నా ఆయ‌న‌కు ఎంతో ఇష్టం. ఎంతోమంది సాహితీవేత్త‌ల‌తో రామారావు స‌న్నిహితంగా ఉండేవారు. క‌ర్నూలు జిల్లా ఆదోనిలో జ‌న్మించిన రామారావు డిగ్రీ పూర్త‌య్యాక బి.ఎడ్., చేయాల‌నుకున్నారు. కానీ, జ‌ర్న‌లిజంపై మ‌న‌సు లాగ‌డంతో ఈనాడులో చేరారు. స‌బ్ ఎడిట‌ర్ గా,సీనియ‌ర్ స‌బ్ గా అక్క‌డ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. త‌రువాత ఉద‌యం ప‌త్రిక ప్రారంభం కావ‌డంతో అందులో చేరారు. అక్క‌డ కూడా ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హించి, ఎడిష‌న్ ఇన్ ఛార్జ్ గానూ ప‌నిచేశారు. హైద‌రాబాద్ వ‌చ్చి ఉద‌యంలో సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా వ్య‌వ‌హ‌రించారు. ఉద‌యం దిన ప‌త్రిక మూత‌ప‌డ‌డంతో అదే స‌మ‌యంలో బి.ఏ.రాజు, జ‌య ప్రారంభించిన సూప‌ర్ హిట్సినిమా మేగ‌జైన్ లో సీనియ‌ర్ రిపోర్ట‌ర్ గా ప‌నిచేశారు. 1996లో అండా రామారావుకు గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు స‌హ ఉద్యోగులు, ప‌రిచ‌య పాత్రికేయులు అంద‌రూ ఆయ‌న‌కు నైతిక బ‌లం అందించారు. ఆ విష‌యాన్ని అండా రామారావు ప‌దే ప‌దే చెప్పుకొనేవారు. 

ఘంట‌సాల అంటే వీరాభిమానం ఉన్న అండా రామారావు, ఆయ‌న‌పై ప‌లు వ్యాసాలు రాశారు. త‌రువాతి రోజుల్లో కొంద‌రి స‌హ‌కారంతో మీ ఘంట‌సాల‌ పుస్త‌కాన్ని తెచ్చారు. సంగీతం అంటే ఎంతో అభిమానం ప్ర‌ద‌ర్శించే రామారావు మ్యూజిక్ ఛాన‌ల్ అనే మాస ప‌త్రిక‌ను కొద్ది రోజులు న‌డిపారు. ఆ త‌రువాత నుంచీ ఎమ్.ఎస్.రెడ్డి వ‌ద్ద పి.ఆర్.ఓ.గా ఉన్నారు. ప్ర‌ముఖ నిర్మాత, యువ‌చిత్ర అధినేత కె.మురారి తెలుగు నిర్మాత‌ల చ‌రిత్ర‌ పుస్త‌కం తీసుకురావ‌డంలో రామారావు కూడా ప‌లువురు నిర్మాత‌ల చ‌రిత్ర‌లు రాసి స‌హ‌క‌రించారు.  గ‌త సంవ‌త్స‌రం హైద‌రాబాద్ నుండి స్వ‌స్థ‌లం మ‌కాం మార్చిన అండా రామారావు, ఘంట‌సాల గానామృతం అనే వాట్స‌ప్ గ్రూప్ కు అడ్మిన్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ఘంట‌సాల అభిమానుల‌కు ఆనందం పంచుతూవ‌చ్చారు. అలాగే యుగ‌పురుషుడు య‌న్టీఆర్ అనే వాట్స‌ప్ గ్రూప్ నూ ఇటీవ‌లే ఆరంభించారు. అనేక పాత చిత్రాల విశేషాల‌ను  అంద‌రికీ అందించాల‌ని అండా రామారావు త‌పించేవారు. అందుకోస‌మే ఈ గ్రూపులు అని భావించ‌వ‌చ్చు. అలాంటి రామారావు ఆదివారం (జూలై 11న‌) ఉద‌యం 11.30 గంట‌ల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు మ‌నోబ‌లం చేకూరాల‌ని ప‌లువురు పాత్రికేయులు త‌మ సంతాపంలో వ్య‌క్తంచేశారు.

Anda Rama Rao passed away:

 Anda Rama Rao passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ