బలమెవ్వడు మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా బలమెవ్వడు. ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ నాయికగా నటిస్తోంది. సుహసినీ, నాజర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు బలమెవ్వడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుంది. ఆదివారం (జూలై 11) స్వరబ్రహ్మ మణిశర్మ బర్త్ డే సందర్భంగా బలమెవ్వడు కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే.. పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం. కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్ లో స్పష్టంగా చూపించారు. భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం వైద్యో నారాయణో హరిని పేర్కొంటూ మెడిసిన్స్ గంగా తీర్థంలా పవిత్రంగా ఉండాలని, వైద్యుడు దేవుడితో సమానమని గుర్తు చేశారు. బలమెవ్వడు కరి బ్రోవను అనే శ్రీకృష్ణ శతక పద్యం వినిపిస్తుంటే డాక్టర్ క్యారెక్టర్స్ లో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ పాత్రలను పరిచయం చేశారు. ఇలాగే హీరో ధృవన్ కటకం, నియా త్రిపాఠీ డెబ్యూ కార్డ్ వేశారు. చివరలో మణిశర్మకు సినిమా టీమ్ బర్త్ డే విశెస్ తెలియజేశారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా బలమెవ్వడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సత్య రాచకొండ.
నటీనటులు: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్