నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త చిత్రం
డైనమిక్ స్టార్, నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్‌తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. సోమవారం(జూలై 5) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ చిత్రాలకు కేరాఫ్ నందమూరి కళ్యాణ్‌రామ్.. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్‌రాజు, శిరీశ్).. వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కళ్యాణ్‌రామ్, గుహన్ కాంబినేషన్‌లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 118 సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. మరో డిఫరెంట్ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ను చూపించడానికి గుహన్ సరికొత్త కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కళ్యాణ్‌రామ్ నటిస్తోన్న 20వ చిత్రమిది. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.