Advertisementt

నిర్మాత, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత

Sat 22nd May 2021 03:24 AM
senior film journalist,producer ba raju,pro ba raju,ba raju  నిర్మాత,  పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత
Producer, PRO BA Raju passes away నిర్మాత, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత
Advertisement
Ads by CJ

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు  ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో  గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే  పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే  ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన పిమ్మట 1994లో తన భార్య  జయ.బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బి ఏ రాజు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో  అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు పి.ఆర్. ఓ.గా పని చేశారు బి.ఏ.రాజు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేవారు.

చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి  జయ.బి  దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి,  చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అరుణ్ కుమార్, శివ కుమార్ అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఇద్దరు సినీ రంగం లో పని చేస్తున్నవారే.   అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు, శివ కుమార్ పూరి జగన్నాధ్, వి వి వినాయక్, మారుతీ, వంటి  ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి 22 అనే చిత్రం తో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం కరోనా కారణంగా విడుదల ఆగింది.

చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను, రేపు గౌతమ్ కృష్ణ హీరోగా  చేసే సినిమాలకు కూడా నేనే పి ఆర్ ఓ గా చేస్తాను.. అని అంటుండేవారు బి. ఏ.రాజు    

ఇక సినీ పాత్రికేయ కుటుంబంలో బి ఏ రాజు కు గొప్ప స్థాన విశిష్టత ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించే బి.ఏ.రాజు  ఫిలిం క్రిటిక్స్  అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ  మొత్తం  అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బి ఏ రాజు ఎదిగారు. సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాలు విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటాయి అనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను  ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు.. ఆ బ్యానర్ ఏమిటి.. రిలీజ్ డేట్ ఏమిటి.. అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది - వంటి సమస్త  వివరాలను,విశేషాలను  ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన  సినీ పరిజ్ఞానం బి.ఏ  రాజు సొంతం.

సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలో ప్రారంభోత్సవంలో శతదినోత్సవాలలో బి ఏ రాజు ప్రెజెన్స్  తప్పనిసరిగా ఉంటుంది. తను కనిపించలేదు అంటే సినీ ప్రముఖులందరూ రాజు ఎక్కడ.. రాజు ఎక్కడ.. అని పదే పదే అడగటం చిత్ర పరిశ్రమలో బి ఏ రాజు సంపాదించుకున్న గుర్తింపుకు, గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత  సంబంధాలను కొనసాగించిన బి ఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్తే అవుతుంది. కాగా బి.ఏ.రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ,కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.  

Producer, PRO BA Raju passes away:

Senior PRO and producer BA Raju is no more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ