అసలేం జరిగింది సాంగ్ లిరికల్!
‘వెన్నెల చిరునవ్వై’ పాట మెలోడియస్ గా ఉందని, చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరాం ఈ సినిమాలో చాలా బాగా నటించాడని దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. ఎక్సోడస్ మీడియా నిర్మించిన అసలేం జరిగింది సినిమాలోని వెన్నెల చిరునవ్వై సాంగ్ లిరికల్ వీడియోని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన విభిన్నమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాక్షించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక ఆదరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు విడుదల చేయడానికిదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు దర్శకత్వం ఎన్వీఆర్ వహించగా, నటుడు శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ థ్రిల్లర్, సస్పెన్స్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ ఏలెంద్ర మహావీర్ మనసు పెట్టి మంచి పాటల్ని అందించారని ప్రశంసించారు. విజయ్ ప్రకాశ్ పాడిన వెన్నెల చిరునవ్వై పాట ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. ఈ చిత్రం ద్వారా జనగాంకు చెందిన రవికుమార్ ప్రతి నాయకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకార్ రెడ్డి, సంగ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.