Advertisementt

రివ్యూ: చిత్రం X

Sat 02nd Jan 2021 03:33 PM
chitram x review telugu review  రివ్యూ: చిత్రం X
Chitram X Movie Review రివ్యూ: చిత్రం X
Advertisement

2020వ సంవత్సరం సినీ ఇండస్ట్రీకి ఎటువంటి గడ్డుకాలమో తెలిసిన విషయమే. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. రీసెంట్‌గా 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు వచ్చినా.. థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే భయం దర్శకనిర్మాతలలో నెలకొంది. అయినా సరే ధైర్యంగా నిర్మాతలు వారి చిత్రాలను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన మెగా హీరో సాయితేజ్ సినిమాకు మంచి స్పందన రావడంతో.. మళ్లీ థియేటర్లలో సినిమాకు మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తూ.. నూతన సంవత్సర కానుకగా కొన్ని చిత్రాలను నిర్మాతలు విడుదల చేశారు. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ పతాకంపై రమేష్ విభూదిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. నిర్మాత పొలం గోవిందయ్య నిర్మించిన ‘చిత్రం ఎక్స్’ చిత్రం కూడా నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ అంశాలతో, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను అందుకుందో మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఒక డీప్ ఫారెస్ట్‌లో ఉన్న పురాతన భవంతిలోకి హీరో, హీరోయిన్లతో పాటు వెళ్లిన మరికొందరని.. 100 సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ అడవి కన్య.. హీరో, హీరోయిన్లను మినహా అందరినీ చంపేస్తుంది. అసలు ఆ అడవి కన్య ఎందుకు వారిని చంపుతుంది? 100 సంవత్సరాల క్రితం బంధించబడిన అడవి కన్య మళ్లీ ఎలా బయటికి వచ్చింది? ఆ అడవికన్య నుంచి హీరో, హీరోయిన్ ఎలా తప్పించుకున్నారు..? చివరకి ఆ అడవి కన్య ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరోగా చేసిన రాజ్ బాలకు నటించడానికి మంచి స్కోప్ లభించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధపెడితే.. మంచి హీరోగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. కల్యాణి పాత్రలో నటించిన మానస కూడా తన నటనతో మెప్పించింది. అడవి కన్య సింధూరగా చేసిన నటి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలికించింది. హీరోయిన్ ఫ్రెండ్స్‌గా చేసిన వారు కూడా ఓకే. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ. కెమెరామెన్ ప్రవీణ్ కె కావలి.. ఫారెస్ట్ అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. కామారెడ్డి డీప్ ఫారెస్ట్‌లోని న్యాచురల్ అందాలను ఆయన క్యాప్చర్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేదు. తొలి చిత్రమే అయినప్పటికీ నిర్మాత పొలం గోవిందయ్య.. ఈ సినిమాని నిర్మించిన తీరు మెప్పిస్తుంది. తక్కువ బడ్జెట్ అయినా.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాని ఎలా నిర్మించవచ్చో.. తొలి చిత్రంతోనే నిర్మాత ఇండస్ట్రీకి నేర్పేలా ఈ చిత్రం ఉంది. ఇక దర్శకుడు రమేష్ విభూదికి కూడా ఇది తొలి చిత్రమే. కాకపోతే సినిమాని ఆయన మలిచిన తీరు.. చాలా అనుభవం ఉన్న దర్శకుడు అనేలా అనిపిస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. ఈ జానర్ ఆడియన్స్‌ని మెప్పించేలా అయితే సినిమా చేయగలిగాడు.

విశ్లేషణ:

దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్.. హిట్టు కాన్సెప్టే అయినప్పటికీ.. ఎగ్జిక్యూట్ చేయడంలో అక్కడక్కడా తడబడ్డాడు. ఈ సినిమాకి ప్రాణమైన అడవి కన్య సన్నివేశాలు ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే.. సినిమా ఇంకా బాగా రీచ్ అయ్యేది. అయినా తనకున్న బడ్జెట్ పరిధిమేర బాగానే చేశాడు. అయితే ఇలాంటి కాన్సెప్ట్‌లలో చిత్రాలు ప్రేక్షకులకు కొత్తకాదు. అడవి కన్యే కథాబలం అని తెలిసిన దర్శకుడు.. ఆ కోణంలో ఇంకొన్ని మంచి సీన్లు జోడించి ఉంటే.. సినిమా టాప్ రేంజ్‌కి వెళ్లేది. హీరో, హీరోయిన్లను కూడా అంతగా దర్శకుడు వాడుకోలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా భవంతిలోని గుప్తనిధులపై నడిపించేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మెయిన్ థీమ్‌ని రివీల్ చేశాడు. క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు భారీగా ఊహించుకుంటే.. దర్శకుడు సింపుల్‌గా తేల్చేశాడు. ఓవరాల్‌గా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పలేం కానీ.. ఆకలి తీర్చడం పక్కా.

ట్యాగ్‌లైన్: సాగతీతలేని సరుకున్న చిత్రం

 

Chitram X Movie Review:

Chitram X Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement