హీరో వరుణ్ సందేశ్ తాత, రచయిత జీడిగుంట మృతి.
ప్రముఖ కథా రచయిత జీడిగుంట రామచంద్ర రావు గారు 1940 లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లో జన్మించారు. కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ నటుడు.మనవడు వరుణ్ సందేశ్ టాలీవుడ్ హీరో. విద్యాశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, అనంతరం ఆకాశవాణి లో ప్రయోక్తగా, ఎలక్ట్రానిక్ మీడియా లో సీనియర్ పాత్రికేయులుగా సేవలు అందించారు. 250 పైగా కథలు రాశారు. ఎన్నో బహుమతులు వరించిన నాటికలు రచించారు. అమెరికా అబ్బాయి అనే సినిమా కు కథా రచయిత గా పని చేశారు. ఈ ప్రశ్నకు బదులేది సినిమా కు సంభాషణలు అందించారు. ఉత్తమ టీవీ రచయితగ రెండు సార్లు నందులను గెలుచుకున్నారు. వారు రచించిన పలు నాటికలు దూరదర్శన్, ఆకాశవాణి ల ద్వారా ప్రసారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక లఘు చిత్రాలు నిర్మించి ప్రశంసలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సాహిత్య రంగం లో కళారత్న పురస్కారం స్వీకరించారు.తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయితగా గౌరవించింది. రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారం, రసమయి రంగస్థల పురస్కారం, యువకళావాహిని నాటక పురస్కారం, కిన్నెర ఉగాది పురస్కారం, చాట్ల శ్రీరాములు ట్రస్ట్, పులికంటి కృష్ణారెడ్డి సాహిత్య పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ, వంశీ ఇంటర్నేషనల్ , జి వీ ఆర్ ఆరాధన, ఆరాధన, అభినందన తదితర సంస్థల పురస్కారాలు జీడిగుంట రామచంద్రరావు ను వరించాయి. నేను నా జ్ఞాపకాలు పేరిట అయన రాసిన బయోగ్రఫీ కి మంచి ఆదరణ లభించింది. అయన రాసిన అమూల్యం, అశ్రుఘోష గ్రంధాలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వరించింది.నల్లమిల్లి పేరిట ఆంధ్రప్రభ, బావ బావా పన్నీరు పేరిట సితార లో, మనుగడ లో మలుపులు అని ఆంధ్రపత్రిక లో అయన రాసిన సీరియల్ నవలలకు విశేష ఆదరణ లభించింది.