Advertisementt

ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది

Mon 19th Oct 2020 02:25 PM
manasantha nuvve movie,uday kiran,ms raju  ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది
It is very sad to miss Uday Kiran ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది
Advertisement
Ads by CJ

ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగా ఉంది. ఎం ఎస్ రాజు మనసులో మాట! 

జీవితంలో చాలా విషయాలు మరచిపోతాం మనం. కానీ, కొన్ని సంఘటనలు.. కొన్ని జ్ఞాపకాలు.. కొన్ని అనుభవాలు.. కొన్ని గాయాలు.. అంత సులువుగా మర్చిపోలేం! అందుకే 19 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి. 2001 సంక్రాంతి.. నా దేవీపుత్రుడు రిలీజ్. ఒకటి రెండూ కాదు.. 14 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. నేను పడిన కష్టం, నేను పెట్టుకున్న ఆశలు అంతా ఆవిరైపోయాయి. దెబ్బలు నాకు కొత్త కాదు.. పరాజయాలు నాకు పరిచయం లేనివి కాదు.. కానీ ఈ దెబ్బ, ఈ పరాజయం మాత్రం నన్ను బాగా కుంగదీసి పారేసింది. శత్రువు సక్సెస్ ఇచ్చిన కిక్, దేవి వల్ల వచ్చిన లైఫ్.. ఇవన్నీ ఈ ఫెయిల్యూర్ తో స్మాష్. దానికితోడు కామెంట్లు. అంత బడ్జెట్ తో సినిమా అవసరమా అని ఇంకెంతోమంది తిట్లు. బాగా కుంగిపోయాను నేను. దాన్నుంచి బయటకు రావడానికి పది రోజులు పట్టింది నాకు.

ఏదైనా అద్భుతం చేయాలని మనసు ఉవ్విళ్లూరడం మొదలు పెట్టింది. అద్భుతం అనేది అంత ఈజీ కాదు కదా! కానీ సంకల్పిస్తే సాధ్యం కానిది ఏముంది? ఏవేవో ఆలోచనలు. కొత్త ఐడియా తో, చిన్న బడ్జెట్ లో సినిమా తీయాలి. ఆ సినిమాతో మళ్ళీ నేను పైకి లేవాలి. నాతోపాటు నన్ను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఒడ్డున పడాలి. మే 1... ఆరోజు ఏదో పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నా. ఎప్పుడో 1954 నాటి సినిమా. హీరో హీరోయిన్ల పాత్రలు, వాళ్ళిద్దరూ కలుసుకోవడం కోసం పడే తపన.. ఇవన్నీ చూస్తుంటే నా మనసులో ఏదో కదలిక మొదలైంది. ఈ ఐడియాతో సినిమా తీస్తే?  వెంటనే పరుచూరి బ్రదర్స్ కి, కెమెరామెన్ ఎన్ గోపాల్ రెడ్డి కి షేర్ చేసాను. వాళ్లు నాకు అత్యంత ఆత్మీయులు. వాళ్లకి విపరీతంగా నచ్చేసింది. అప్పటివరకు మా సుమంత్ ఆర్ట్స్ సంస్థలో ఏ సినిమాకైనా కోడి రామకృష్ణ గారే దర్శకులు. అప్పటికప్పుడు మళ్లీ ఆయనతో సినిమా అంటే కష్టమే. ఆయనకేమో వేరే కమిట్మెంట్లు ఉన్నాయి. మరి డైరెక్టర్ ఎవరు? ఆ టైంలో ఎస్ గోపాల్ రెడ్డి ఓ కుర్రాడి గురించి చెప్పారు. నన్ను కలిశాడతను. వెంటనే అతన్ని డైరెక్టర్ గా ఎనౌన్స్ చేశా. అతనే వి.ఎన్.ఆదిత్య.

హీరో గా ఎవరిని పెట్టాలి ? దర్శకుడు తేజ కి ఫోన్ చేశా. అప్పుడు అతను నువ్వు నేను తీస్తున్నాడు. కావాలంటే ఈ సినిమా చూపిస్తా అన్నాడు. నేను ఒక సాంగ్ చూశాను. కుర్రాడు బాగున్నాడు అనిపించింది. అరగంటలో నా ఆఫీస్ దగ్గర ఉన్నాడు అతను. తలుపు కొట్టి సర్, రావొచ్చా అంటూ లోపలికి వచ్చాడు. అతను ఉదయ్ కిరణ్.

నెక్స్ట్ డే బాంబే ఫ్లైట్ ఎక్కా. ఓ హోటల్ లాబీలో కలిసింది రీమాసేన్. అప్పటికే చిత్రంలో యాక్ట్ చేసింది. రీమాసేన్ కూడా ఓకే. దేవి శ్రీ ప్రసాద్ ని దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా నేనే ఇంట్రడ్యూస్ చేశా. దీనికి అతన్ని తీసుకుందామనుకున్నా కానీ, కుదరలేదు. ఆర్.పి పట్నాయక్ వచ్చాడు. మా ఆఫీస్ డాబా మీద ఒక్కరోజులో అన్ని ట్యూన్స్ ఓకే అయిపోయాయి. సిరివెన్నెలగారు ఏదో తపస్సు చేసినట్టుగా పాటలు రాసిచ్చేశారు. కమెడియన్ సునీల్ కి కూడా మంచి వేషం. నేనంటే రెస్పెక్ట్. రెమ్యూనరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తానన్నాడు. అంకుశం లాంటి సినిమాకు పనిచేసిన ఎడిటర్ కృష్ణారెడ్డి నేను సైతం అంటూ మా టీం లో కలిశాడు. 

మే 10 నా పుట్టినరోజు. ఆ రోజే మనసంతా నువ్వే కి పూజ. జూన్ 1 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి. పూజ అయిపోగానే అరకు వెళ్ళిపోయాము. కథలో మలుపులు మెరుపులు అక్కడే అమరాయి. రోజూ దెబ్బలాటలే.. స్క్రిప్ట్ కోసం. ఒక్కోసారి నేనే అలిగి వెళ్లిపోయే వాడిని. ఆదిత్య బతిమలాడి తీసుకు వచ్చే వాడు. జూన్ 1... హైదరాబాద్లో షూటింగ్ మొదలుపెట్టాo. ఎక్కడా బ్రేకుల్లేవు. ఏం అనుకున్నామో అదే తీశాo. నా సంకల్పానికి ప్రకృతి కూడా సహకరించింది. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా పాటను వానలో తీద్దాం అనుకుంటుంటే నిజంగానే వాన వచ్చేసింది. అందరూ ఇష్టపడి కష్టపడి పని చేశారు. బోలెడన్ని బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. కాని నేను సొంతంగా రిలీజ్ చేయడానికి రెడీ. పడినా నేనే.. లేచినా నేనే..! అక్టోబర్ 19న నేను కోరుకున్న అద్భుతమే సంభవించింది. మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ అయ్యింది. నా కష్టాలన్నీ తీరిపోయాయి.పేరుకి పేరు డబ్బుకి డబ్బు. కోటి 30 లక్షలతో తీసిన సినిమా 16 కోట్ల దాకా వసూలు చేసింది. మే 1 న చిన్ని విత్తనంలా మొలకెత్తిన ఆలోచన నాలుగున్నర నెలల్లో ఓ అద్భుతానికి కారణమైంది. ఈ నాలుగున్నర నెలల్లో నేను సరిగ్గా నిద్రపోలేదు అంటే మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది.

పరుచూరివారి పెన్ పవర్.. గోపాల్ రెడ్డిగారి కెమెరా ఎక్స్ లెన్సీ.. ఆర్. పి పట్నాయక్ మ్యూజిక్ మేజిక్.. సిరివెన్నెలగారి పదాల విశ్వరూపం.. సుచిత్ర మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ.. కృష్ణారెడ్డి కత్తెర పదును.. మధ్య మధ్యలో వీరుపోట్ల కామెడీ పంచులు.. ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఇతర ఆర్టిస్టుల ఎక్స్ల్లెంట్ పెర్ఫార్మన్స్.. వీటన్నింటికన్నా దర్శకుని వి.ఎన్ ఆదిత్య పనితనం.. ఇలా సూపర్ టీమ్ వర్క్ తో బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగాం. ఇలా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద గ్రంథమే రాసేయొచ్చు. అరకులో ఓ చోట రాళ్ల మీద టెంపుల్ సెట్ వేశాం. ఆ రాళ్ల మీద ఇప్పటికీ ఇంకా రంగులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ రంగులు వెలిసిపోతే పోవచ్చు కానీ, నా జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ వెలిసిపోవు. అంత ఇష్టం నాకు ఈ సినిమా అంటే. నా సినిమాల్లో చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. ఈ విషయంలో.. ఈ విజయంలో.. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పుకోవాలి. ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా నా మనసులో ఎప్పటికీ ఉంటుంది.

         -ఇట్లు, మీ ఎం.ఎస్.రాజు. 

manasantha nuvve movie,uday kiran,ms raju

It is very sad to miss Uday Kiran:

It is very sad to miss Uday Kiran

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ