పాన్ ఇండియా ఫిల్మ్ ‘గమనం’లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన శర్వానంద్
లేడీ డైరెక్టర్ సుజనా రావు డైరెక్ట్ చేస్తోన్న తొలి చిత్రం ‘గమనం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా నిర్మాణమవుతోంది. రియల్ లైఫ్ డ్రామాగా ‘గమనం’ రూపొందుతోంది. గాయని శైలపుత్రీ దేవి అనే ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం హీరో శర్వానంద్ ఆవిష్కరించారు. పోస్టర్‌లో శాస్త్రీయ గాయనిగా పట్టుచీర ధరించి ఒక కచేరీలో గానం చేస్తున్న నిత్యా మీనన్ ముఖంలో అందమైన చిరునవ్వుతో పాటు ఒక దైవత్వం కూడా గోచరిస్తోంది. కథలో నిత్య స్పెషల్ అప్పీరెన్స్ ప్రాధాన్యం ఏమిటనేది ఆసక్తికరం.
ఇటీవల విడుదల చేసిన శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో డీగ్లామరస్‌గా తక్కువ మేకప్‌తో, సంప్రదాయ వస్త్ర ధారణతో కనిపించిన శ్రియ లుక్ అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడు, నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మరోసారి ఆశ్చర్యపరిచారు నిర్మాతలు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్న ‘గమనం’ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న జ్ఞానశేఖర్ వి.ఎస్. ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తూ, రమేష్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం:
శ్రియా శరణ్, నిత్యా మీనన్
సాంకేతిక బృందం:
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: మేస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్.
ఎడిటింగ్: రామకృష్ణ అర్రం
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజనా రావు