తెలుగు, తమిళ సినీరంగాలలోని 39 మంది ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అమరావతి, అన్నవరం, అమలాపురం తదితర ప్రాంతాలలోని కనువిందు చేసే పచ్చని లొకేషన్లలో...ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమే ఇదని దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు వెల్లడించారు. కళాతపస్వి కె.విశ్వనాధ్‌గారు ఈ చిత్రం గురించి తెలుసుకుని ప్రశంసించారని ఆయన తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఈ చిత్రంలో బాలాదిత్య, అర్చనల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను యువ హృదయాలను హత్తుకునేలా దర్శకుడు చిత్రీకరించారని నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి తెలిపారు. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం భారీ బడ్జెట్ గా రూపాంతరం చెందిందని నిర్మాత వివరించారు. త్వరలో ఓటీటీలో లేదా థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, జయవాణి, బెనర్జీ, రఘుబాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, జీవాలతో పాటు పలువురు తమిళ, మలయాళ నటీనటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్, ఎడిటింగ్: వాసు, నిర్మాత: ఎం. ఎన్. ఆర్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు).