టాలీవుడ్ ప్రముఖ గాయని గీతా మాధురి భర్త, నటుడు నందు గత నాలుగైదు రోజులుగా ‘బీబీ’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన విషయం విదితమే. దీంతో నెటిజన్లు, గీతా, నందు అభిమానులు, మిత్రులు బిగ్‌బాస్-04లోకి ఎంట్రీ ఇస్తున్నాడని అందరూ భావించారు. పైగా అస్తమానూ ‘బీబీ’ అని పోస్టులు చేస్తుంటే పక్కా అని ఫిక్స్ అయ్యారు. పైగా చాలా రోజులుగా నందు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వెళ్తున్నాడనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. దీనికి తోడు స్వయంగా ‘బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నా’ అని పోస్ట్ పెట్టడం.. ఆ తర్వాత మళ్లీ ‘డార్లింగ్స్.. నేను బీబీలో ఉన్నాను. అందులో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ కావాలి’ అని అతనే ప్రకటించడంతో ఇది పక్కాగా బిగ్‌బాసే అని అనుకున్నారు. మీడియా వాళ్లు కూడా నందును హైలైట్ చేసి తనకు తానుగా కన్ఫామ్ చేశాడు కదా అని వార్తలు రాసేశారు.
అయితే తీరా చూస్తే.. నందు అనుకున్న ‘బీబీ’ వేరు.. మీడియా రాసిన ‘బీబీ’ వేరు. ప్రస్తుతం సోషల్ మీడియా, మీడియాలో బిగ్‌బాస్ షో ఈ కరోనా నేపథ్యంలో ఎలా ఉండబోతోంది..? కంటెస్టెంట్లు ఎవరు..? అని అందరూ చర్చించుకున్న టైమ్‌లో దీన్నే అదనుగా భావించి ఆ బీబీని ఇలా వాడేసుకున్నాడు నందు. తీరా చూస్తే.. తను అనౌన్స్ చేసిన బీబీ అదేనండోయ్.. ‘బొమ్మ బ్లాక్ బ్లస్టర్’ మూవీ అట. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అయితే.. మీరు చెప్పిందేంటి.. అనౌన్స్ చేసిందేంటి..? అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. బిగ్‌బాస్ ప్రచారాన్ని ఇలా నందు క్యాష్ చేసుకున్నాడన్న మాట.
కాగా.. ఈ చిత్రం విజయీభవ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నందు సరసన యాంకర్ రష్మి నటిస్తోంది. విశాఖ జిల్లాకు సంబంధించిన కథ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. బీబీ అంటే అసలు కథ ఇదన్న మాట. ఎంతైనా ట్రెండింగ్‌లో టాపిక్‌ను నందు ఇలా క్యాష్ చేసుకున్నాడన్న మాట. సో.. ఇంకా ఇలా బీబీ (బిగ్‌బాస్)ని ఎంతమంది వాడేస్తారో మరి.