గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాతయ్యను పిల్లలు కథ చెప్పమని అడుగుతారు. దానికి ఆ తాతయ్య బదులిస్తూ.. ‘జీవితాన్నే కథగా చెబుతా వినండి’ అనడంతో ‘జోహార్’ టీజర్ మొదలవుతుంది. ‘‘అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యానికి ప్రాణం పోసే పంచభూతాల్లాంటి ప్రజలు అని తాతయ్య కథను మొదలు పెడతాడు. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా సరే! మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పే ఓ యువ రాజకీయ నేత. పరుగు పందెంలో గెలవాలనుకునే అమ్మాయి, భర్త లేని ఓ స్త్రీ ఇలా వీరి మధ్య నడిచే కథకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంది’’ అనేది తెలియాలంటే మాత్రం ‘జోహార్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘జోహార్’ సినిమా అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన, మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ద్వారా విడుదలవుతుంది., ఇప్పటికే ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫరెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆగస్ట్14న పొలిటికల్ డ్రామా ‘జోహార్’ను విడుదల చేస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ మార్ని నిర్మిస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి తేజ మార్ని, సందీప్ మార్ని సహా యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని, టీజర్ ఆసక్తికరంగా ఉందన్నారు వరుణ్ తేజ్. దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాను తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఆనందంగా ఉంది. అల్లు అరవింద్‌గారు సహా మా సినిమా విడుదలకు సాయపడుతున్న అందరికీ థాంక్స్. టీజర్‌ను విడుదల చేసిన వరుణ్ తేజ్‌గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు’’ అన్నారు.
అంకిత్ కొయ్య, ఈస్తర్ అనిల్, శుభలేఖ సుధాకర్, నైనా గంగూలీ, ఈశ్వరీ రావు, రోహిత్ తదితరులు తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, మ్యూజిక్: ప‌్రియదర్శన్, డైలాగ్స్: వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనీల్ చౌదరి, లైన్ ప్రొడ్యూసర్: కల్యాణ్ కృష్ణ, రాఘవేంద్ర చౌదరి, నిర్మాత: సందీప్ మార్ని, దర్శకత్వం: తేజ మార్ని.