టాలీవుడ్‌లో తనదైన ముద్ర కలిగిన చిత్రాలు తీయడంలో పూరీ జగన్నాథ్‌కి ఎంతో ప్రత్యేకస్థానం ఉంది. కృష్ణ చిత్రంతో దర్శకునిగా మారినా, అది విడుదల కాలేదు. ఆ తర్వాత పవన్‌తో బద్రి నుంచి హీరోల క్యారెక్టరైజేషన్స్, లుక్స్, డైలాగ్స్.. ఇలా తనదైన శైలిని ఆయన సృష్టించుకున్నారు. రవితేజ, మహేష్‌బాబు, పవన్ ఇలా అందరికీ పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. స్వయంగా రాజమౌళి వంటి వాడే నేను రెండు మూడు సీన్లలో చెప్పే హీరోయిజాన్ని పూరీ ఒకే డైలాగ్‌తో చెబుతాడని, ఆయన వేగంగా చిత్రాలను తీసే విధానం తెలుసుకోవడానికి తనకు ఆయన వద్ద అసిస్టెంట్‌గా చేరాలని ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ఇక పూరీకి మద్య మధ్యలో అపజయాలు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ, టెంపర్ తర్వాత ఈయన సినిమాలపై పట్టును కోల్పోయాడు. ఆయన ఒకనాడు హీరోయిజం, యూత్‌ని టార్గెట్ చేస్తూ చిత్రాలు తీసేవాడు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కానీ దానికి అనుగుణంగా ఆయన మారలేకపోతున్నాడు. అందునా ఆయన చెంతకు చార్మి చేరిన తర్వాత ఆయన అదృష్టం తిరగబడిందని, అన్ని విషయాలలో ఆమెదే పైచేయి అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా’ ఇలా ఆయన ఫ్లాప్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రవితేజ వంటి వారిని స్టార్స్‌ని చేసిన ఆయన తన సోదరుడు సాయిరాంశంకర్, కుమారుడు ఆకాష్‌లకు కూడా ఫ్లాప్‌లే ఇచ్చాడు. దీంతో కొంతకాలం కిందట పూరీ దర్శకత్వంలో ఓ చిత్రమైనా చేయాలని ఆశపడిన యంగ్ హీరోలు కూడా ఆయనకు మొహం చాటేస్తున్నారు. రామ్ కూడా ఎంతో కాలానికి గానీ ఆయనకు ఓకే చెప్పలేదు.
తాజాగా పూరీ-రామ్‌ల కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ ప్రారంభం అయింది. ఈ మూవీలో రామ్ లుక్ కూడా పక్కా పూరీ స్టైల్‌లో సిగరెట్టు, బుల్లెట్, బటన్స్ విప్పిన షర్ట్‌తో అదే కోవలో కనిపిస్తోంది. ఇక చార్మి పుణ్యమా అని అజ్ఞాతవాసి, నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా వంటి డిజాస్టర్స్‌తో ఐరన్‌లెగ్‌గా ముద్రపడిన అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్ అని తెలుస్తోంది. మొత్తం ఫ్లాప్ బ్యాచ్‌తో వస్తోన్న ఈ చిత్రం అందరికీ కీలకమనే చెప్పాలి.