తెలుగు, తమిళ, మళయాలీ భాషల్లో ఫిబ్రవరి 8న వైఎస్‌ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల
జననేతగా తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్‌ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు.
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర తన రాజకీయ యాత్రలో ఎంత కీలకమో కొంతమందికే తెలుసు. అప్పటి రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొవటానికి ఈ యాత్ర మెదలుపెట్టారు.. కాని ఆ యాత్రలో ఎన్ని విషయాలు ఆయన ఎంత దగ్గరగా చూశారో, సాదారణమైన కష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా కలిసారో, పేదవారంటే ఎవరో.. వారు దేనికోసం చూస్తున్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆయన మనసు చలించిపోయింది. జనంతో మమేకమై వారిలోని భావోద్రేకాన్ని అర్థం చేసుకుంటూ తన యాత్రని కొనసాగించారు. ఈ యాత్ర కొనసాగింపు నుంచి ముగింపు వరకూ వున్న ఘట్టాన్ని తీసుకుని మహి వి రాఘవ్ అత్యద్బుతంగా అత్యంత సున్నితమైన సన్నివేశాలతో, ఆద్యంతం భావోద్రేక సంఘటనలతో చిత్రం చూస్తున్నంత సేపు వైఎస్‌ఆర్ మడమ తిప్పని వైనం, ఆయనకి పేదలంటే ఎంత ప్రాణమో.. ఈ చిత్రంలో కల్లకు కట్టినట్టు చూపించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మడమతిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్నారు. మమ్ముట్టిగారు ప్రజానాయకుడు వైఎస్‌ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారని నిస్సందేహంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మొదటి లుక్‌కి, టీజర్‌కి, ఫస్ట్ సింగిల్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
ఆంధ్రపద్రేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాజకీయ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా వైఎస్‌ఆర్ అభిమానులుతో పాటు సాదారణ సినిమా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుందని మా బృందం భావిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగుతో పాటు ఫిబ్రవరి 8న తమిళ, మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం..’’ అని అన్నారు.