మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి 'విజేత' అనే టైటీల్ ను ఫైనల్ చేశారు. కళ్యాణ్ దేవ్ సరసన 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. 'చిరంజీవి గారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'విజేత' టైటిల్ ను ఆయన అల్లుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. కథకు బాగా యాప్ట్ అవుతుంది. 'బాహుబలి' చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి.