Advertisementt

చిరంజీవికి 'ఖైదీ'.. చరణ్ కు 'రంగస్థలం'..!!

Mon 19th Mar 2018 08:28 PM
ram charan,rangasthalam,pre release event,highlights,chiranjeevi,sukumar,dsp,samantha  చిరంజీవికి 'ఖైదీ'.. చరణ్ కు 'రంగస్థలం'..!!
Rangasthalam Pre Release Event Highlights చిరంజీవికి 'ఖైదీ'.. చరణ్ కు 'రంగస్థలం'..!!
Advertisement
Ads by CJ

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వైజాగ్ ఆర్‌.కె.బీచ్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌, స‌మంత‌, పూజా హెగ్డే, ఆది పినిశెట్టి, సుకుమార్‌, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), రామ్ ల‌క్ష్మ‌ణ్‌, చంద్ర‌బోస్  త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - తెలుగు ప్ర‌జ‌ల‌కు, మెగాభిమానుల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు. నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ న‌గ‌రాన్ని, ఇక్క‌డి అభిమానుల్ని చూస్తుంటే నేను ప్రారంభంలో చేసిన ఆరాధ‌న‌, అభిలాష‌, ఘ‌రానామొగుడు సినిమాలు గుర్తుకు వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో బంగారు భ‌విష్య‌త్ గురించి ఆలోచించుకుంటూ వైజాగ్ అంత‌టా తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. రేపు రిటైర్డ్ అయిన త‌ర్వాత వైజాగ్‌లోనే ఉండాల‌నిపిస్తుంది. నిర్మాత‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు చేసి వారికంటూ ఓ బ్యాన‌ర్ వేల్యూను క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌తి హీరో వారితో సినిమా చేయాల‌నుకుంటున్నారంటే వారెంత మంచి నిర్మాత‌లో అర్థం చేసుకోవ‌చ్చు. దేవిప్ర‌సాద్, త్రివిక్ర‌మ్ రావు, అశ్వ‌నీద‌త్, అల్లు అర‌వింద్‌ వంటి స్టార్ నిర్మాత‌ల స్థాయి నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌. చ‌ర‌ణ్ ఎప్పుడూ వారి గురించే చెబుతుండేవాడు. ఈ సినిమా వారికి హ్యాట్రిక్ హిట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. సుకుమార్ అద్భుతమైన ప‌నిత‌నాన్ని చూపించాడు. ప్యూర్ విలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. త‌ను నాకు చెప్పిన‌ప్పుడు ఎలాచెప్పాడో.. అంతే ప్యూర్‌గా ఈ రోజు ఎమోష‌న‌ల్‌గా సినిమాను తెర‌కెక్కించాడు. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను సినిమా క‌ట్టి ప‌డేస్తుంది. సినిమాను నేను ఎంజాయ్ చేసి చూశాను. ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించే సినిమా అవుతుంది. నాకు ఖైదీ సినిమా ఎలాగో.. రామ్‌చ‌ర‌ణ్‌కి ఇది స్టార్‌స్టేట‌స్‌ను పెంచే సినిమా అవుతుంది. త‌ను పెర్ఫామర్‌గా ఎదిగే సినిమా అవుతుంది. సుకుమార్‌.. చ‌ర‌ణ్‌తో ఇంత మంచి సినిమా చేసినందుకు ఆర్టిస్ట్‌గా ఈర్ష్య ప‌డుతున్నాను. ఓ తండ్రిగా గ‌ర్వ‌ప‌డుతున్నాను. సుకుమార్ గ్రామంలో పుట్టి పెర‌గ‌డం వ‌ల్ల ఎమోష‌న్స్ మిస్ కాకుండా చ‌క్క‌గా తీశాడు. సినిమాలో ఓ క‌న్విక్ష‌న్‌తో నేచుర‌ల్‌గా సాంగ్స్‌ను తెర‌కెక్కించాడు. హీరో క్యారెక్ట‌ర్‌ను డీ గ్లామ‌రైజ్ చేయించి ..చ‌ర‌ణ్‌ కెరీర్‌లో ఓ త‌ల‌మానిక‌మైన సినిమాను చేసిన సుకుమార్‌కి నా అభినంద‌న‌లు. సుకుమారే ఈ సినిమాకు క‌ర్త‌,క‌ర్మ‌, క్రియ‌గా సినిమాను ముందుకు న‌డిపించాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా అద్భుత‌మైన బాణీల‌ను అందించాడు. నాలుగు రోజుల్లో అంత మంచి సాంగ్స్ ఇచ్చాడ‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. చంద్ర‌బోస్‌గారు అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. నెటివిటీకి అనుగుణంగా అంద‌మైన పాట‌ల‌ను అందించారు. ర‌త్న‌వేలుగారు ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. రామ‌కృష్ణ‌, మోనిక‌గారు అద్భుత‌మైన సెట్ వేశారు. ఆ సెట్ రియ‌ల్ లోకేషన్‌లా అనిపించింది. త‌న‌కు ఈ సినిమాతో అవార్డులు రావ‌డం ఖాయం. ఆది డిగ్నిటి ఉన్న పాత్ర‌లో అత్య‌ద్భుతంగా నటించాడు. చ‌ర‌ణ్ గ‌ర్వ‌పడేలా సినిమాలో న‌టించాడు. చాలా ఇన్టెన్స్‌తో న‌టించాడు. స‌మంత పాత్ర‌లో ఒదిగిపోయింది. జ‌గ‌ప‌తిబాబుగారు సెటిల్డ్ రోల్ చేశారు., ప్ర‌కాశ్ రాజ్‌గారి పాత్ర‌, అన‌సూయ చేసిన అత్త‌పాత్ర స‌హాఅన్నీ పాత్ర‌లు మెప్పిస్తాయి. ఈ సినిమా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అన్ని విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకుంటుంది. జాతీయ‌స్థాయిలో కూడా అవార్డువ‌చ్చినా ఆశ‌ర్య పోనక్కరలేదు. జాతీయ అవార్డులు రావాలి ..రాకుంటే అన్యాయం జ‌రిగిన‌ట్లే. 2018లో ఈ సినిమా అత్య‌ద్భుత‌మైన సినిమా అవుతుంద‌ని కోరుకుంటున్నాను.. అన్నారు.

ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ - మా జ్ఞాప‌కాల‌న్నీగుర్తుకు తెచ్చుకుంటూ చేసిన సినిమా ఇది. సుకుమార్‌గారితో ఆర్య నుండి అనుబంధం ఉంది. మా 30 ఏళ్ల కెరీర్‌లో చాలా మంది డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేశాం. కానీ సుకుమార్ వంటి డైరెక్ట‌ర్ పిచ్చి డైరెక్ట‌ర్‌ని చూడ‌లేదు. సినిమాలంటే అలాంటి పిచ్చి ఉన్న డైరెక్ట‌ర్ ఆయ‌న‌. అన్న‌య్య‌తో ఖైదీ నంబ‌ర్ 150 చేశాం. ఇప్పుడు చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం చేశాం. సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. చ‌ర‌ణ్ బాబు ఈ సినిమాతో అంద‌రి కుటుంబంలో ఓ వ్య‌క్తిలా ఉండిపోయే పాత్ర చేశాడు. తెలుగు నెటివిటీని సుకుమార్‌గారు చూపించారు. నిర్మాత‌లు త్రిమూర్తులు. ఎంతో మంది టెక్నీషియ‌న్స్‌ను ప్రోత్స‌హిస్తున్నారు. వారు మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాం..అన్నారు. 

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ - నిర్మాత‌లు రాజ‌మండ్రిలో షూటింగ్  స‌మయంలో 400-500  మంది ఉండ‌టానికి కావాల్సిన వ‌సతులన్నీ చేసి అంద‌రినీ కంఫ‌ర్ట్‌గా ఉంచారు. వారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ర‌త్న‌వేలుగారు ఓ ఊరుని ఎంతో అందంగా ఉండాలో అంత అందంగా చూపించారు. అలాగే రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఎమోష‌న్స్‌తో పైట్స్‌ను కంపోజ్ చేశారు. ఆర్ట్ డైరెక్ట‌ర్  రామ‌కృష్ణ‌గారికి, మోనిక గారికి థాంక్స్‌. నాన్న‌గారు నాలుగైదు సార్లు నెల్లూరుకి తీసుకెళ్లారు. ఆప‌ద్భాంవుడు సినిమాకు పూడిప‌ల్లి గ్రామానికి తీసుకెళ్లారు. త‌ర్వాత నేను ప‌ల్లెటూరుకి వెళ్ల‌లేదు. ఈ సినిమాతో సుకుమార్ నా కోరికను తీర్చాడు. స‌మంత‌తో న‌టించేట‌ప్పుడు ఓ ఎన‌ర్జీ వ‌స్తుంది. త‌ను మంచికో ఆర్టిస్ట్‌. అన‌సూయ‌గారికి థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చాడు. త‌న‌తో నేను చేసిన రెండో సినిమా ఇది. చంద్ర‌బోస్‌గారు అంద‌రికీ అర్థ‌మ‌య్యే రీతిలో సాహిత్యాన్ని అందించారు. ఇంత మంచి సినిమా చేయ‌డానికి కార‌ణ‌మైన సుకుమార్‌గారికి హ్యాట్సాఫ్‌. నాకే ఓ కొత్త చ‌ర‌ణ్‌ని ప‌రిచ‌యం చేశాడు. సుకుమార్‌గారి వ‌ల్ల నాపై నాకే గౌర‌వం పెరిగింది. సుకుమార్‌గారిని రోజూ చూడ‌లేనేమోన‌ని దిగులు ప‌ట్టుకుంది.  ఆ గ‌డ్డం లుక్‌, లుంగీని బాగా ఎంజాయ్ చేశాను. మా అమ్మానాన్న‌ల‌తోపాటు ఫ్యాన్స్ గ‌ర్వ‌ప‌డే సినిమాను సుకుమార్ నాకు ఇచ్చారు. స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌.. అన్నారు. 

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు ఇదే వేదిక‌పై  సరైనోడు సినిమా ఫంక్ష‌న్‌కి వ‌చ్చి బ‌న్నిని ఆశీర్వ‌దించాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు రంగ‌స్థ‌లం కోసం ఇదే వేదిక‌పైకి చ‌ర‌ణ్‌ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చారు. చ‌ర‌ణ్ ఇది వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని సినిమా ఇద‌ని.. సినిమా చూసిన అంద‌రూ అంటున్నారు. చ‌ర‌ణ్‌కి ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను. సినిమాలో ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌న‌లు. చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్ అభినంద‌న‌లు. స‌మంత చాలా నేచుర‌ల్‌గా న‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సుకుమార్‌తో అంద‌రూ హీరోలు ప‌నిచేయాల‌ని కోరుకుంటారెందుకో ఈ సినిమా ఒక చిన్న ఉదాహ‌ర‌ణ‌.. అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ మాట్లాడుతూ - చిరంజీవిగారికి, అర‌వింద్‌గారికి న‌మ‌స్కారాలు. చిరంజీవిగారు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికంటే చిరంజీవిగారి ప‌దవి పెద్ద‌ది క‌దా! అయ‌నెందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ అన్నారు. నిజంగానే చిరంజీవిగారి ప‌ద‌వి చాలా ప్ర‌త్యేకం. ఆయ‌న‌కే సాధ్యం. ఈ సినిమా చూసిన ఆయ‌న ఎంతో బాగా అప్రిసియేట్ చేశారు. నిర్మాత‌లు గురించి చెప్పాలంటే.. మా టీంను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. ర‌త్న‌వేలుగారి సినిమాటోగ్ర‌ఫీ కార‌ణంగా నేను మంచి ద‌ర్శ‌కుడ్ని కాగ‌లిగాను. దేవిశ్రీ ప్ర‌సాద్ సిచ్యువేష‌న్స్ విని.. కేవ‌లం మూడున్న‌ర రోజుల్లోనే గొప్ప మ్యూజిక్ అందించాడు. నా ఎమోషన్స్‌ను త‌ను చ‌క్క‌గా క్యారీ చేశాడు. చంద్ర‌బోస్‌గారు పాట రాయ‌లేదు. అలా చెప్పుకుంటూ పోయారు. సమంత‌తో లైఫ్‌లాంగ్ సినిమాలు చేయాల‌ని ఉంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ వేసిన సెట్ మ‌న‌కు క‌న‌ప‌డ‌దు. ఎందుకంటే సెట్ అంత బాగా వేశాడు. త‌న‌కు అవార్డుని క్రియేట్ చేసి నేనే ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆది పినిశెట్టి.. పాత్ర‌లో ఒదిగిపోయాడు. రామ‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ప్యూర్ ఎమోష‌న్స్‌తో యాక్ష‌న్ కంపోజ్ చేశారు. జ‌గ‌ప‌తిబాబుగారు, ప్ర‌కాశ్ రాజ్‌గారు ఎంతో స‌పోర్ట్ చేశారు. న‌వీన్ నూలి సినిమాను చ‌క్క‌గా ఎడిట్ చేసిచ్చాడు. కాస్ట్యూమ్స్ వ‌ర్క్ చేసిన సుస్మిత‌, శాంతిగారికి థాంక్స్‌. రామ్‌చ‌ర‌ణ్ చిట్టిబాబు క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోవ‌డానికి ఎక్కువ స‌మయం తీసుకోలేదు. చ‌ర‌ణ్ పెర్ఫామెన్స్ చూసి మేమే కాదు.. ప్ర‌కాశ్ రాజ్‌లాంటి న‌టుడు కూడా క్లాప్స్ కొట్టాడంటే త‌ను ఎలా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవ‌చ్చు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌.. అన్నారు. 

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవిగారికి, గంటా శ్రీనివాస‌రావుగారికి, వైజాగ్ క‌మీష‌న్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌ గారి విశ్వ‌రూపం చూస్తారు. చ‌ర‌ణ్‌గారికి ఈ సినిమా చిరంజీవిగారి ఖైదీ లాంటి సినిమా అవుతుంది. స‌మంత‌గారు చాలా చ‌క్క‌గా న‌టించారు. దేవిశ్రీగారితో మా బ్యాన‌ర్‌లో మూడు సినిమాలకు ప‌ని చేశాం. భ‌విష్య‌త్‌లో ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాం.. అన్నారు. 

స‌మంత మాట్లాడుతూ - మేమంద‌రం క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా రంగ‌స్థ‌లం. ఈ టీంతో క‌లిసి ప‌నిచేయ‌డం నా అదృష్టం. సుకుమార్‌గారు మంచి వ్య‌క్తి. ప్ర‌తి విష‌యాన్ని ప్రేమ‌తో చేశారు. ఆయ‌న ఎంతో ప్రేమ‌తో రాసుకున్న ఈ క్యారెక్ట‌ర్‌కు న్యాయం చేయాల‌ని చాలెంజ్‌గా తీసుకుని ఈ పాత్ర చేశాను. చ‌ర‌ణ్‌గారి గురించి చెప్పాలంటే... చిరంజీవిగారికి స్వ‌యంకృషి ఎలాగో.. చ‌ర‌ణ్‌కి రంగ‌స్థ‌లం అలా మంచి పేరు తెస్తుంది. చాలా కాలం పాటు చ‌ర‌ణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర గుర్తుండిపోతుంది. దేవిశ్రీగారు సూప‌ర్‌హిట్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత‌ల ముఖాల్లో ఎప్పుడూ చిరున‌వ్వే ఉంటుంది. విష‌యాల‌ను చాలా చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. యూనిట్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డాం. మార్చి 30 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.. అన్నారు. 

దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ఇది నాకు స్పెష‌ల్ మూవీ. నాకు ఎప్ప‌టి నుండో ఫోక్ మ్యూజిక్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయాల‌నే కోరిక ఉండేది. ఆ కోరిక సుకుమార్ వ‌ల్ల తీరింది. ఓ థీమ్‌కు సంబంధించిన మ్యూజిక్ చేయాలంటే ఓ ఎమోష‌న్ కావాలి. ఆ ఎమోష‌న్ అందించిన వ్య‌క్తుల్లో నాన్న స‌త్య‌మూర్తిగారు మొద‌టి వ్య‌క్తి. స‌మ్మ‌ర్ హాలీడేస్‌లో ఆయ‌న న‌న్ను విలేజ్‌కు తీసుకెళ్లేవారు. అందువ‌ల్ల క‌నెక్ట్ అయ్యాను. అలాగే సుకుమార్‌గారికి అదే ఎమోష‌న్ ఇచ్చిన ఆయ‌న తండ్రిగారికి నా థాంక్స్‌. ఇక మూడో వ్య‌క్తి ఇళ‌య‌రాజాగారు. ఆయ‌న కంపోజ్ చేసిన విలేజ్ సినిమాల మ్యూజిక్ చూసి నాకు అలాంటి ఛాన్స్ ఎప్పుడూ వ‌స్తుందోన‌ని అనుకునేవాడిని. నాలుగో వ్య‌క్తి నా గురువుగారు శ్రీనివాస్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాలో నాకు వ‌చ్చిన స‌క్సెస్‌ను ఈ న‌లుగురితో పాటు మా నాన్న‌గారి ఊరు వెదురుపాకంకు కూడా అంకితం చేయాల‌నుకుంటున్నాను. సుకుమార్‌గారు నాపై న‌మ్మ‌కంతో నా మ్యూజిక్‌లో డిఫ‌రెంట్ యాంగిల్‌ను ప్రెజంట్ చేస్తూ వ‌స్తున్నారు. బోస్‌గారు త‌న సాహిత్యంతో అంద‌మైన ఎమోష‌న్స్‌ను క్రియేట్ చేశారు. ఆయ‌న అందించిన సాహిత్యానికి నేను ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటూ వ‌చ్చాను. బోస్‌గారు సాహిత్యాన్ని అలా సింపుల్‌గా చెప్పేశారు. ర‌త్న‌వేలుగారు టాప్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. చ‌ర‌ణ్ నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుసు. త‌ను ఈ సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్‌ను చేయ‌డం అంత సుల‌భం కాదు. త‌ను పెర్ఫామెన్స్‌ను చూసి నాకు చిరంజీవిగారిని చూసిన‌ట్లు అనిపించింది. స‌మంత ఆ క్యారెక్ట‌ర్‌లో జీవించింది. ఆది పినిశెట్టిగారు చాలా మంచి పాత్ర చేశారు. నిర్మాత‌ల‌కు చాలా థాంక్స్‌. మోస్ట్ డిగ్నిఫైడ్ ప్రొడ్యూస‌ర్స్‌.. అన్నారు. 

ఆది పినిశెట్టి మాట్లాడుతూ - రంగ‌స్థ‌లం ఒక మ్యాజిక్‌. సినిమా చూసే ప్రేక్ష‌కులు 1980లోకి వెళ్లిపోతారు. ఎగ్జామ్ రాసే కుర్రాళ్ల‌లో ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్, భ‌యం ప్ర‌తి సీన్‌లో క‌న‌ప‌డుతుంది. ఇది గొప్ప టెక్నీషియ‌న్స్ క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత పెర్ఫామెన్స్‌.. సుకుమార్‌గారి ద‌ర్శ‌క‌త్వం.. ర‌త్న‌వేలు విజువ‌ల్స్‌, దేవిశ్రీగారి సంగీతం.. ఇలా అంద‌రూ సినిమాలో మాయ చేశారు. సినిమాలో ఆమేజింగ్ పెర్ఫామెన్స్ చేశారు. చిరంజీవిగారికి ఖైదీ సినిమా ఎలా నిలిచిందో... చ‌ర‌ణ్‌కు ఈ సినిమా అలా నిలుస్తుంది.. అన్నారు. 

ఆర్ట్ డైరెక్ట‌ర్స్ రామ‌కృష్ణ‌, మోనిక మాట్లాడుతూ - మా కెరీర్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఎందుకంటే బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ ప్రొడ్యూస‌ర్స్ తో ప‌నిచేయ‌డమే. పూర్తిస్థాయి తెలుగు సినిమా. రేపు సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే ప‌క్కా తెలుగు మూవీ అవుతుంది. మాకు అవకాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌.. అన్నారు. 

అన‌సూయ మాట్లాడుతూ - ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌.  రామ్ చ‌ర‌ణ్ నాకు ఫేవ‌రెట్ యాక్ట‌ర్‌. ఆయ‌న‌తో అత్త అని పిలిపించుకోవ‌డం.. ఆయ‌న్ను అల్లుడు అని పిల‌వ‌డమేంట‌ని గొడ‌వ పెట్టాను. మేం అంద‌రం రంగ‌స్థ‌లం అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందరినీ అందులోకి తీసుకెళ్ల‌బోతున్నాం. మన నాన్న‌, తాత‌య్య‌, అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ‌లు ఎలా ఉండేవారో సినిమాలో చూడ‌బోతున్నాం.. అన్నారు. 

సుస్మిత మాట్లాడుతూ - సుకుమార్‌గారి స‌ల‌హాలు, సూచ‌న‌లు లేకుంటే  చ‌ర‌ణ్ లుక్ అంత బాగా వ‌చ్చుండేదేమో కాదు. చ‌ర‌ణ్ లుక్‌ను చాలా బాగా క్యారీ చేశాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లకు థాంక్స్‌.. అన్నారు. 

జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ - నెల్లూరులో పుట్టిన నాకు సినిమాల్లో తెలిసిన స్టార్ ఎవ‌రంటే మెగాస్టార్ చిరంజీవిగారే. ఆయ‌న న‌టించిన ముగ్గురు మొన‌గాళ్ళును రోజుకి ఐదు షోలు లెక్క‌లో ముప్పై రోజులు చూశాను. సినిమా విష‌యానికి వ‌స్తే.. జిగేల్ రాణి పాట‌ను వెస్ట్ర‌న్ లుక్‌లో ఫోక్ క‌ల్చ‌ర్‌లో చేయ‌డం అంత సుల‌భం కాదు. పూజా హెగ్డేగారు అద్భుతంగా న‌టించారు. రేపు ఈ సాంగ్‌ను ప్రేక్ష‌కులు చూస్తూ థియేట‌ర్స్‌లో కూర్చోలేక డాన్స్ లేస్తారు.. అన్నారు. 

పూజా హెగ్డే మాట్లాడుతూ - ఈ పాట‌ను నేను చేయ‌గ‌లుగుతాన‌ని న‌మ్మి నాకు అవ‌కాశం ఇచ్చినందుకు సుకుమార్‌గారికి థాంక్స్‌. ఇలాంటి సాంగ్ చేయ‌డం నాకు కూడా కొత్త‌గానే ఉంది. దేవిశ్రీ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు.. అన్నారు.

Rangasthalam Pre Release Event Highlights:

Mega Power Star Ram Charan's Rangasthalam pre release event was held on Sunday, March 18.. at RK beach of Vizag city

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ