అంగరంగ వైభవంగా 'వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1' ప్రారంభోత్సవం
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (ఫిబ్రవరి 22న) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో భారీ స్థాయిలో మునుపెన్నడూ ఏ స్టార్ హీరో సినిమా ఓపెనింగ్ జరగనంత ఘనంగా వైభవంగా జరిగింది. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నవీన్ శొంటినేని (నాని) నిర్మిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులైన సి.కళ్యాణ్, కె.ఎస్.రామారావు, ఏం.ఎస్.రాజు, అభిషేక్, శ్రీవాస్, బి.గోపాల్, ఎస్.గోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి (ఎం.ఎల్.ఏ), మహేందర్ రెడ్డి, జెమిని కిరణ్, బెల్లంకొండ సురేష్, రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, డాలీ తదితరులు పాల్గొన్నారు.
చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. తెలంగాణా ఎఫ్.డి.సి ఛైర్మన్ రామ్మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. గురజాల ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు-దర్శకులు శ్రీవాస్ కలిసి కెమెరా స్విచ్చాన్ చేశారు. జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)-మహేందర్ రెడ్డిలు కలిసి స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ శొంటినేని మాట్లాడుతూ.. 'మా బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించివారందరికీ కృతజ్నతలు' అన్నారు.
చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నవీన్ తో కలిసి సినిమా చేద్దామని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. ఇన్నాళ్లకు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇంతవరకూ నా కెరీర్ లో మాత్రమే కాదు అసలు తెలుగు చిత్ర సీమలో ఎవ్వరూ చూడని సరికొత్త పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఛోటా గారితో కలిసి 'అల్లుడు శీను'కి వర్క్ చేశాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాకి ఆయనతో కలిసి వర్క్ చేయనుండడం చాలా ఆనందంగా ఉంది. తమన్ తో తొలిసారిగా వర్క్ చేయనున్నాను' అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నన్ను, నా కథను నమ్మి నాకీ అవకాశమిచ్చిన నిర్మాత నవీన్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 2వ తారీఖు నుంచి మొదలవ్వనుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించనున్నారు. వాళ్లెవరన్నది త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు.
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. 'మా జిల్లా బిడ్డ అయిన నవీన్ శొంటినేని ఈ చిత్రంతో నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగిడుతుండడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కథ, భారీ స్థాయి యాక్షన్ మరియు ఎంటర్ టైన్మెంట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను' అన్నారు.
కెమెరామెన్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. 'దర్శకుడు శ్రీనివాస్ నాకు చాలా కాలంగా తెలుసు. మంచి కథ, కథను మించిన అద్భుతమైన స్క్రీన్ ప్లే వినిపించి మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. నిర్మాత భారీ బడ్జెట్ లో సినిమా తీయమని మాకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ.. కథకి అవసరమైనంత వరకే ఖర్చు చేసి ఆయనకి మంచి ఔట్ పుట్ ఇవ్వడం కష్టపడతాం. నవీన్ భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను' అన్నారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: గణేశుని వెంకటేశ్వర్రావు, కో-డైరెక్టర్: కె.పుల్లారావు, ఫైట్స్: స్టన్ శివ-వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, మాటలు: కేశవ్ పప్పల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సంగీతం: తమన్.ఎస్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, నిర్మాణం: వంశధార క్రియేషన్స్, నిర్మాత: నవీన్ శొంటీనేని (నాని), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్.