టాలీవుడ్ మరో హాస్య నటుడిని కోల్పోయింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏ. వి. ఎస్ వంటి వారు అనారోగ్య కారణాలతో కన్ను మూసిన సంగతి పూర్తిగా మరిచిపోక ముందే... ఇప్పుడు మరో హాస్య నటుడు గుండు హనుమంత రావు కూడా అనారోగ్యంతో ఈ సోమవారం ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. అమృతం సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట లో వినికిడి కోల్పోయిన వ్యక్తి పాత్రలో హాస్యం పండించారు. ఈమధ్యనే ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నట్లుగా 'ఈ' టీవీలో అలీ హోస్ట్ గా చేస్తున్న ప్రోగ్రాం ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. తెలియడమే తడవుగా గుండు హనుమంతరావుకి 'మా' తరపున నుండి సహాయం అందించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు డబ్బు సహాయం చేశారు. ఆయన బ్రతకాలని అందరూ ఆకాక్షించారు. కానీ అయన మృత్యువుతో పోరాడి వెళ్లిపోయారు.
'గుండు' ని కోల్పోవడం బాధాకరం: బ్రహ్మీ
గుండు మరణాన్ని తట్టుకోలేని కమెడియన్ బ్రహ్మనందం కన్నీళ్ల పర్యంతమయ్యారు. తానొక గొప్ప మిత్రుడిని కోల్పోయానని... తనని ఎప్పుడూ గుండు 'బావా' అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడనని... అలాంటి గుండు ఇప్పుడు లేడంటే నమ్మశక్యం కావడం లేదంటూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో తనకున్న అతి కొద్దీ మంది మిత్రులలో గుండు హనుమంత రావు ఒకరని.. కొద్ది రోజుల క్రితమే తన ఇంటికి వచ్చిన గుండు ఇప్పుడు లేరంటే... తనకు బాధ కలిగిస్తుందని చెప్పారు.
చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది: బాలకృష్ణ
ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదు స్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.
గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి: డా.మోహన్ బాబు
మా నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో చాలా సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి ఆయన. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాధుని వేడుకొంటున్నాను.