తమిళనాడు, కర్ణాటక మాదిరిగా టాలీవుడ్‌లో కూడా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం భవనం నిర్మించాలని, అది తన హయాంలోనే జరగాలని మా అధ్యక్షుడు శివాజీ రాజా భావిస్తున్నాడు. ఇక 'సై..రా' చిత్రం షూటింగ్‌లో నిమగ్నమైనప్పటికీ చిరంజీవి ఈ భవనం ఫండ్స్ కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు వస్తానని మాట ఇచ్చాడు. మరోవైపు తన నుంచి ఏ సాయం కావాల్సినా తాను ముందుంటానని మహేష్ మాట ఇచ్చాడట. ఇలా స్టార్స్ కూడా తమకు సహకరిస్తామని అంటుంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు మినహా మిగిలిన వారు మాత్రం మాకు సమయం లేదు అని చెబుతూ తప్పుని మేనేజర్ల మీదకు నెట్టివేస్తున్నారని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలుగు నిర్మాతలు, దర్శకుల, హీరోల సాయంతో పైకి ఎదిగి.. కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డాడు. తమ భవన నిర్మాణ విరాళాల కోసం హీరోయిన్లకి వారు అడిగినంత ఇవ్వకపోయినా మా చేతనైనా మొత్తం ఇస్తామని, ఈ కార్యక్రమంలో హీరోయిన్లు కూడా పాల్గొనాలని ఆయన కోరాడు. ఇక ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం హీరోయిన్లు తమ చుట్టూ తిరుగుతారని, లక్ష రూపాయలతో సభ్యత్వం తీసుకుని 20లక్షల చెక్‌బౌన్స్ కేసును తమ ముందు పరిష్కరించాలని కోరుతారని ఆయన మండిపడ్డాడు.
తమకు సహకరిస్తే తాము కూడా వారికి అండగా ఉంటామని, కాదని తోక జాడిస్తే కత్తిరిస్తామని శివాజీ రాజా ఘాటుగా విమర్శలు సంధించారు. 'మా'కు సహకరించని హీరోయిన్లు మాకు అవసరం లేదని తేల్చిచెప్పిన ఆయన హీరోయిన్లు కూడా దీనిలో ముందుకొస్తే భవనంలో వారి ఫొటోలను కూడా పెట్టుకుంటామని మాట ఇచ్చారు. మరి శివాజీరాజా ఘాటు వ్యాఖ్యల నేపధ్యంలో హీరోయిన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సివుంది.