ఈ దసరాకి 'స్పైడర్' తో పెద్ద హిట్ కొడుతున్నాం - సూపర్‌స్టార్ మహేష్
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగింది. ఈ కార్యక్రమంలో స్పైడర్ సినిమాలో పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా..
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - నేను చెన్నై వచ్చిన కొత్తలో సినిమాల్లో నటించాలని అనుకుంటున్న సమయంలో ఓసారి కుటుంబరావుగారితో మాట్లాడుతుంటే డైరెక్టర్ శ్రీధర్‌గారు వచ్చి తమిళ సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు. నాకు తమిళం రాదని అన్నా, ఆయనే తమిళం నేర్పిస్తానన్నారు. కానీ నాకు తమిళం రాకపోవడంతో నేను ఆ సినిమాలో చేయలేకపోయాను. ఆ సినిమాయే కాదలిక్క నేరమిల్లై. తర్వాత నాకు ఆదుర్తి సుబ్బారావుగారు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా నన్ను అభిమానులు మూడు వందల యాభై సినిమాల్లో ఆదరించారు. ఇప్పుడు మహేష్‌ను ఆదరిస్తున్నారు. మహేష్ ప్రతి సినిమాలోనూ ఇంప్రూవ్ మెంట్ కనపడుతుంది. స్పైడర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తమిళ హీరోలానే డైలాగ్స్ చెప్పాడు. ఓ హీరో తమిళంలో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక మంచి దర్శకుడుతో ఇంట్రడ్యూస్ అయితే బావుంటుందని అనుకునేవాడిని. చాలా గొప్ప దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ కావడం ఆనందంగా ఉంది. అన్నీ పాటలు బావున్నాయి. సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతున్నాను..అన్నారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ - స్పైడర్ ఒక హాలీవుడ్ మూవీలా ఉంటుంది. మంచి పాటలు, స్టైల్‌గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు..అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ - స్పైడర్ ఫస్ట్ పోస్టర్, టీజర్ వచ్చినప్పటి నుండి చాలా క్యూరియస్‌గా చూస్తున్నాను. ప్రతి పోస్టర్, టీజర్ క్వాలిటీగా ఉంది. ఇండియాలో ఫైనెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. మురుగదాస్‌గారి గ్రిప్పింగ్ నెరేషన్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఇక సంతోష్‌శివన్, హరీష్‌జైరాజ్ వంటి టీం ఉంటే సినిమా ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీంకు ఆల్ ది బెస్ట్..అన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ - మహేష్‌బాబుది మొదటి బైలింగ్వువల్ సినిమా. మహేష్ నువ్వు మద్రాస్‌లో పుట్టి పెరిగావ్ కాబట్టి, తమిళంలో యాక్ట్ చేస్తే బావుంటుందని చెప్పేవాడిని. ఇప్పుడు నిజమైంది. స్టైల్, ఇన్‌టెన్సిటీ, ఎమోషన్ అనే మూడు లక్షణాలు సూపర్‌స్టార్ సినిమాలో ఉండాలి. ట్రైలర్ చూస్తుంటే అవన్నీ కనపడుతున్నాయి. నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, మురుగదాస్‌లకు అభినందనలు.. అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - మురుగదాస్‌గారి రచనలకు, దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఒక సోషల్ పాయింట్ తీసుకుని, ఎక్కువ మందికి రీచ్ చేయడంలో మురుగదాస్‌గారిని మించిన దర్శకుడు ఇండియాలోనే లేడు. ఎక్సలెంట్ టీం కుదిరింది. మహేష్‌గారు డైరెక్టర్‌గారికి ఇచ్చే రెస్పెక్ట్ గొప్పగా ఉంటుంది. కన్విక్షన్ ఉన్న హీరో మహేష్..అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ మాట్లాడుతూ - స్పైడర్ ఆడియో వేడుకకు రాకపోవడానికి కారణం నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాను. సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. మురుగదాస్‌గారికి థాంక్స్. ఈ సినిమా నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది. అలాగే మహేష్‌గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. రకుల్, ఎస్.జె.సూర్య సహా యూనిట్‌కు అభినందనలు. ఈ సందర్భంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం..అన్నారు.
నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను చేస్తానని నేను ఊహించలేదు. ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని సినిమా చేశాం. మన తెలుగు హీరోను తమిళంలో లాంచ్ చేయాలని మహేష్‌గారికి చాలా స్క్రిప్ట్స్ వినిపించాను. కానీ చివరకు మురుగదాస్‌గారి స్క్రిప్ట్ నచ్చింది. స్క్రిప్ట్ వినగానే మహేష్‌గారు నాపై నమ్మకంతో ఐదు నిమిషాల్లోనే సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ముందుగా మహేష్‌గారికి థాంక్స్. అందరూ గర్వపడేలా సినిమా చేశానని కచ్చితంగా చెబుతున్నాను. గ్యారంటీగా సినిమా ఇండస్ట్రీ సూపర్‌హిట్ చిత్రాల్లో 'స్పైడర్' ఒకటిగా నిలిచిపోతుంది. అందరూ ఎంత అతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మహేష్, సంతోష్ శివన్, మురుగదాస్, హరీష్ జైరాజ్ అండ్ టీం కృషితో మంచి సినిమా చేశాం. ముఖ్యంగా సంతోష్‌శివన్‌గారు ఫస్ట్ కాపీ వచ్చేవరకు మరే చిత్రం చేయకుండా ఈ సినిమా కోసం పనిచేశాను. హరీష్ జైరాజ్‌గారి వర్కింగ్ స్టయిల్ చూసి ఆశ్చర్యపోయాను. అలాగే పీటర్ హెయిన్స్ ఒక మనిషి వంద మందితో సమానంగా పనిచేశారు. సినిమాలో పీటర్ హెయిన్‌గారి యాక్షన్ సీన్స్ చూసి థ్రిల్ అవుతారు. మురుగదాస్‌గారు స్క్రిప్ట్ నుండి ఎంతో కష్టపడ్డారు. ఆయన, ఆయన టీం ఎంతో కష్టపడి మంచి సినిమాను అందించారు. అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి పండుగ వాతావరణాన్ని తెస్తుంది. ఇంత గ్రేట్ ప్రాజెక్ట్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.. అన్నారు.
చిత్ర దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ - ఈరోజు నా లైఫ్‌లో చాలా ముఖ్యమైనరోజు. నేను మహేష్‌గారి సినిమా ఒక్కడుని విజయవాడలో చూశాను. సినిమా విడుదలై మూడు వారాలైన సినిమా హౌస్‌ఫుల్‌గా, పండుగలా అనిపించింది. నేను అప్పటి నుండి మహేష్‌ను కలిసినప్పుడల్లా నేను ఒక ఫ్యాన్‌ని. మీతో సినిమా చేయాలనుంది అని చెప్పాను. ఒక డైరెక్టర్‌కి మంచి బలం అంటే హీరోనే. స్పైడర్ ఎలా వచ్చిందని చాలా మంది అడిగారు. వారికి నేను చెప్పేదేంటంటే, స్పైడర్..మహేష్‌బాబుగారిలా వచ్చింది. స్టైల్‌గా, హ్యాండ్‌సమ్‌గా, డేడికేషన్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఓ ఏడాది జరిగిన షూటింగ్‌లో ఆరు నెలలు నైట్ షూటింగే చేశాను. ఏ రోజు కూడా సార్..నేను రేపు ఆలస్యంగా వస్తానని ఒక్కరోజు కూడా చెప్పలేదు. అంత కమిట్‌మెంట్ ఉన్న హీరో మహేష్. మహేష్‌బాబు డేడికేషన్‌కు ఈ సినిమా హిట్‌ను నేను ఆయనకు డేడికేట్ చేస్తాను. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో వర్క్ చేశాను. మహేష్‌లాంటి హీరోనెక్కడా చూడలేదు. మహేష్‌గారు లేకుండా ఈసినిమా సాధ్యమైయ్యేది కాదు. ఠాగూర్ సినిమా సమయంలో నుండి మధుగారితో పరిచయం ఉంది. సినిమా నిర్మాణం నుండి ప్రతి చిన్న విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. సంతోష్ శివన్‌గారి వర్క్‌తో కొత్త మహేష్‌ను ఈ సినిమాలో చూస్తారు. హరీష్ జైరాజ్ సంగీతంలో పాటలు అల్రెడి హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. పీటర్ హెయిన్‌గారికి, శ్రీకర్‌గారికి థాంక్స్. నేను, ఎస్.జె.సూర్యగారు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆయన హీరోగా కూడా సినిమాలు చేశారు. నేను అడగ్గానే నాకోసం విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారు. ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ లండన్‌లో జరుగుతుంది. నా టీం ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. అందరికీ థాంక్స్.. అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ఈ రోజు మా టీంకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా వెయిట్ చేశాం. మురుగదాస్‌గారిని పదేళ్ల క్రితం పోకిరి సమయంలో కలిశాను. అప్పటి నుండి మేం ఇద్దరం సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆయనతో సినిమా చేయడానికి పదేళ్లు పట్టింది. నాకు మురుగదాస్‌గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసే కథలు, స్క్రీన్‌ప్లే, సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో పదేళ్ల తర్వాత సినిమా చేయడం నా అదృష్టం. ఈ కథను నాకు మా ఇంట్లో గంటన్నర పాటు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ట్రార్డినరీ సీన్స్, ఫైట్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఎక్స్‌ట్రార్డినరీ థ్రిల్లర్ చేద్దామని, సినిమా చూసే ఆడియెన్స్ స్టన్ అయిపోవాలని అన్నారు. ఆడియెన్స్ ఏంటి? డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనే స్టన్ అయిపోయాను. ఒక బై లింగ్వువల్ సినిమా చేయడం జోక్ కాదు. మా అంత ప్రాపర్‌గా ఇప్పటి వరకు బైలింగ్వువల్ ఎవరూ చేయలేదేమో. ఒక షాట్‌ను తెలుగులో ఐదు సార్లు, తమిళంలో ఐదార్లు సార్లు చేయడం జోక్ కాదు. గ్రేట్ డైరెక్టర్ వల్లనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మురుగదాస్‌గారికి హ్యాట్సాఫ్. ఏడాదిన్నరగా ఆయనతో చేసిన జర్నీని మరచిపోలేను. పోకిరి సమయంలో మురుగదాస్‌గారిని కలిసినప్పుడు ఎలా ఉన్నారో అదే అట్యిట్యూడ్, సింప్లిసిటీతో ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక పాన్ ఇండియా డైరెక్టర్‌తో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్. స్పైడర్‌లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ప్యాషన్ ఉండాలి. మా మీద నమ్మకం పెట్టిన నిర్మాతలకు థాంక్స్. ఈసినిమాకు మేమెంత కష్టపడి పనిచేయాలో అంత కష్టపడి పనిచేశాం. సెప్టెంబర్ 27న స్పైడర్‌ను హిట్ చేసే బాధ్యత అభిమానులదే. సంతోష్ శివన్‌గారితో వర్క్ చేయడం గౌరవంగా ఉంది. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు దళపతి, రోజా సినిమాలు చూసినప్పుడు పెద్దయ్యాక ఆయనతో సినిమాలు చేయాలనుకున్నాను. చాలాసార్లు ట్రై చేశాను. మురుగదాస్‌గారి వల్ల కుదిరింది. పీటర్‌మాస్టర్‌కి థాంక్స్. శోభిగారికి థాంక్స్. ఎస్.జె.సూర్యగారి దర్శకత్వంలో పనిచేశాను. ఇప్పుడు కోస్టార్‌గా కూడా పనిచేశాను. క్లైమాక్స్ షెడ్యూల్ చేయడం చాలా కష్టమైంది. నా కెరీర్‌లో అంత కష్టమని నాకెప్పుడూ అనిపించలేదు. ఇన్‌టెన్స్ షెడ్యూల్ అది. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాం. రకుల్ ఎంత బిజీగా ఉన్నా, డేట్స్ అడ్జస్ట్ చేసి సపోర్ట్ చేసింది. సూర్యగారి ఎనర్జీ అసలు తగ్గనేలేదు. హరీష్‌జైరాజ్‌గారు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారని యూనిట్ అంతా నాకు చెప్పారు. సినిమా చూడటానికి నేను కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. నేను ఒకసారి కథ ఒప్పుకుని చేస్తే, దానికి నేను ప్రాణం పెట్టేస్తాను. నాకు నా డైరెక్టర్ దేవునితో సమానం. అది నమ్మినందుకే ఒక అతడు, ఒక పోకిరి, ఒక శ్రీమంతుడు, ఒక్కడు సినిమాలు వచ్చాయి. నేను అది నమ్మడం వల్లే ఇంతవాడినయ్యాను. మీలాంటి అభిమానులు నాకున్నారు. ఇలాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. ఎందుకంటే, నా సినిమా నచ్చితేనే నా అభిమానులు చూస్తారు. లేకుంటే చూడరు. మీరెప్పుడూ అలానే ఉండాలి. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. నాకు తమిళం మాట్లాడటం వచ్చినా, బయట మాట్లాడటం, సినిమాల్లో మాట్లాడటం వేర్వేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి తమిళంలో డబ్బింగ్ చెప్పే అవకాశం కలిగించింది మురుగదాస్‌గారు. సెప్టెంబర్ 27న స్పైడర్ విడుదల కాబోతుంది. అన్నీ పండగల కన్నా ఈ పండుగను పెద్దగా కొట్టబోతున్నానని అనుకుంటున్నాం. అభిమానులు ఆశీస్సులు వుంటాయని కోరుకుంటున్నాను..అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.