ఈ నెల 17న ఖమ్మంలో నందమూరి బాలకృష్ణ–పూరి జగన్నాథ్–భవ్య క్రియేషన్స్‌ల ‘పైసా వసూల్’ ఆడియో!
సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం ఇటీవల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నదే. అయితే... ముందు ప్రకటించిన విడుదల తేదీ కంటే ఓ నెల రోజుల ముందే రాబోతున్నది మాత్రం ‘పైసా వసూల్’ చిత్రమే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ముందు చెప్పిన తేదీ కంటే నెల రోజుల ముందు విడుదల కానున్న సినిమాగా ‘పైసా వసూల్’ చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది.
నందమూరి బాలకృష్ణ స్పీడు, దర్శకుడు పూరి జగన్నాథ్ సూపర్ క్లారిటీ, భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ వల్లే ఇది సాధ్యమవుతోంది. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఖమ్మంలో అభిమానుల సమక్షంలో జరగనున్న భారీ వేడుకలో ‘పైసా వసూల్’ పాటలను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత వి. ఆనందప్రసాద్‌లు హైదరాబాద్ నుంచి ఖమ్మంకు హెలికాఫ్టర్‌లో వెళ్లనున్నారు. అదే రోజున సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టంపర్ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ– నందమూరి బాలకృష్ణగారితో సినిమా చేసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అదీ పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో ‘పైసా వసూల్’ వంటి సినిమా చేసినందుకు మరింత ఆనందంగా ఉంది. స్టంపర్‌కు వస్తోన్న స్పందనను బట్టి నందమూరి అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన స్టంపర్ 68 గంటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ కావడం ఒక రికార్డు గా చెప్పుకోవాలి . ఇప్పటివరకు డెబ్భైలక్షలమంది స్టంపర్‌ను చూశారు. ఇంకా చూస్తున్నారు. ప్రేక్షకుల్లో అంచనాలను స్టంపర్ మరింత పెంచింది. ఆ అంచనాలను తప్పకుండా చేరుకుంటుందీ సినిమా. బాలకృష్ణగారి నటన, పూరీగారి టేకింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం రీ–రికార్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటలను ఈ నెల 17న ఖమ్మంలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నాం. సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే... అన్నారు.
శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్–హాలీవుడ్ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేశ్, విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.