సినిమాలు, రాజకీయాలు బహుచిత్రమైనవి. వీటిని పెద్దలు మాత్రమే సూత్రీకరించగలరు. ఎంతో కాలంగా ఆయా రంగాలను సునిశితంగా పరిశీలించే వారికే ఆ రహస్యాలు తెలుస్తాయి. ఇక దిగ్గజ దర్శకుడు దాసరి కన్నుమూసి పరలోకాలకు వెళ్లారు. కాగా కొంతకాలం కిందట సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు స్వర్గీయ విప్లవ దర్శకుడు టి.కృష్ణ జీవిత చరిత్రను 'వెండితెర అరుణకిరణం' అనే పుస్తకం రాశారు.
ఆ పుస్తక ఆవిష్కరణకు వచ్చిన దాసరి తాను ఓ పుస్తకం రాస్తున్నానని, దానిలో ఎన్నో వాస్తవాలుంటాయని, తామేదో గొప్పవారిగా చెప్పుకునే పలువురి నిజజీవితాలు అందులో పొందుపరుస్తున్నానని తెలిపాడు. దానికి ఉదాహరణగా స్వర్గీయ ఎన్టీఆర్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఎవరు? అంటే అందరూ ఎల్వీ ప్రసాద్ అంటారని, ఇంకొంతకాలం పోతే వాస్తవాలు తెలియని తరం తెలుగు ఇండస్ట్రీ హైదబారాబాద్‌లోనే మొదలైందని అంటారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
అంటే దీని ప్రకారం ఎన్టీఆర్‌ను పరిచయం చేసింది ఎల్వీప్రసాద్ కాదని, మరెవరో ఉన్నారని అర్ధమవుతోంది. గతంలో కూడా ఎమ్మెస్‌రెడ్డి, నిర్మాత మురారిలు రాసిన పుస్తకాలను కొందరు బలవంతంగా అడ్డుకుని కొన్ని వాస్తవాలు బయటకు రాకుండా చేశారు. ఇక దాసరి తన 50ఏళ్లకు పైగా సినీ జీవితంలో సావిత్రి, ఎస్వీరంగారావు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి రాజబాబు, చిరంజీవి, చరణ్ వరకు ఎందరినో చూశాడు.
ఇక ఆయన తాను రాస్తున్నది బయోపిక్ అని చెప్పలేదు. బయోపిక్ అయితే ఆయన లేకుండా బయటకు రావడం సమంజసంకాదు. కానీ దాసరి రాస్తున్నది తెలుగు సినీ ప్రముఖుల వాస్తవ గాధలు. దాదాపు మూడున్నరేళ్ల నుంచి ఈ పుస్తకం రాస్తున్నానని దాసరి నాడు తెలిపారు. మరోఏడాదిన్నరలో పుస్తకం బయటకు తెస్తానన్నారు. ఆ పుస్తకం ఒరిజినల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎక్కడి వరకు వచ్చింది అర్ధం కావడం లేదు. ఈ పుస్తకాన్ని దాసరి రాసినంత వరకైనా బయటకు తేవాల్సిన అవసరం ఉంది. దానిని చరిత్ర గర్బంలో కలిపేయకూడదు. కాబట్టి దాసరి దత్తపుత్రులైన మోహన్‌బాబు, ప్రముఖ జర్నలిస్ట్ ప్రభులే ఈ విషయంలో చొరవచూపాలి...!